వార ఫలాలు : 10వ తేదీ ఆదివారం నుండి 16వ తేదీ శనివారం వరకు

Rasi Phalalu. ఈ వారం వార ఫలాలు: 10వ తేదీ ఆదివారం నుండి 16వ తేదీ శనివారం వరకు.

By Medi Samrat  Published on  10 Jan 2021 5:14 AM GMT
Raasi Palalu

*విశేష పర్వదినములు*

11-1-2021 సోమవారం *మాస శివరాత్రి*. త్రయోదశి మరియు చతుర్దశి సోమవారం కలిసిన పర్వదినం.

12-1-2021 మంగళవారం *కృష్ణ అంగారక చతుర్దశి* మరియు మార్గశిర మాసం అమావాస్య.

13-1-2021 బుధవారం *భోగి పండగ*. గోదా కళ్యాణం.

14-1-2021 గురువారం *మకర సంక్రాంతి* మహా పర్వదినం, *ఉత్తరాయణం ప్రారంభం* , పెద్దలకు పేరంటాలకు మన సంపదను చూపించి ఆనందింప చేయడం,బ్రాహ్మణులకు ఆమద్రవ్యాదుల దానము చేయుట మంచిది.

*పుష్య మాసం* ప్రారంభం.

15-1-2020 1 శుక్రవారం కన్నుల పండుగ *కనుమ పండుగ.*

16-1-2020 1 శనివారం *ముక్కనుమ పశువుల పండుగ* మరియు *బొమ్మలు నోములు.*

16-1-2021 శనివారం నుంచి *గురు మూఢం* ప్రారంభము.

మేష రాశి :

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. మకర సంక్రమణం నాడు మారుతున్న రవి మీకు కార్ర్య జయాన్ని కలిగిస్తున్నాడు. అయితే ఫలితాన్ని పొందడం కోసం మీరు విపరీతమైన శ్రమ పడవలసి ఉంటుంది. అదికాక మీకు రాహువు కేతువులు అకారణ కలహాలు చోర బాధ కలిగిస్తుండగా శని మీకు రాజకీయంగా కూడా ఇబ్బందులు కలుగ చేయనున్నాడు. శుక్రుడు మీకు ధనధాన్య వృద్ధిని కలిగించి మీకు ఆర్థికంగా కాస్త ఊరట కలిగించే నున్నాడు. ఈ వారం మీరు 45% శుభ ఫలితాలు పొందుతున్నారు. అశ్విని నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. భరణి నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్తిక 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం :- గురు చరిత్ర పారాయణం,దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. సర్ప సూక్త పారాయణ కూడా మంచిదే.

వృషభ రాశి :- ఈ రాశి వారికి ఈవారం పెద్దగా అనుకూలంగా ఉండదు. అయితే ఆర్థికమైన విషయాలలో కొంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మీ మీద ద్వేషం పెంచుకున్న వారు పెరిగారు కాబట్టి అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఉన్నట్లయితే మీరు ఎక్కువగా మంచిని పొందే అవకాశం ఉంది. రవి, కుజులు ఇద్దరూ మిమ్మల్ని ఇబ్బందుల పెట్టబోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉండండి. రాహుకేతువులు సైతం మీకు వ్యతిరేకంగా పని చేసే పనిలో ఉన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీకు ఈ వారంలో 27శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. మృగశిర 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సూర్యనమస్కారాలు, సూర్యోదయ సమయానికి సూర్య దర్శనం చేయండి. కుజునికి జపం చేయించండి మంచి ఫలితాన్నిస్తుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ధనలాభం కుటుంబసౌఖ్యం సుఖసంతోషాలు ఉన్నాయి. అయితే మకర సంక్రమణం తర్వాత నుంచి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదా మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో నైనా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుజుడు ఈ వారంలో ధనప్రాప్తి కలిగించనుండగా బుధుడు మీ కోరికలను నెరవేర్చే పనిలో ఉన్నాడు. గురు శుక్రులు ఇద్దరు మీకు అనుకూలంగా వ్యవహరించరు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వారంలో 36 శాతం ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది పునర్వసు 1 2 3 పాదాలు వారికి మాత్రం జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- నవగ్రహ హోమం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్యనమస్కారాలు, సూర్యోదయ సమయానికి సూర్య దర్శనం చేయండి

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి శుభ పరిణామాలు పెరుగుతున్నాయి. విశేష ధనం ఎంత వస్తుందో అలాగే అందుకు తగ్గ ఖర్చు కూడా ఉంటుంది. అయినా సరే వీరు ఎంతో కొంత దాచుకునే ప్రయత్నం చేస్తారు అది చాలా మంచి నిర్ణయం. మీరు ఎంత కృషి చేసినా అంతకు తగ్గ ఫలితం రావట్లేదు అని విలపిస్తూ ఉంటారు కానీ అవసరం లేదు మీకు మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా ఇంకా ముందుకు మీరు వెళ్ళ గలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానం అయినటువంటి శని ప్రభావం బాగా లేకపోవడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది. మీకు శుక్ర గ్రహ స్థితి కారణంగా మహిళల వల్ల అపకీర్తిని పొందుతారు. కాబట్టీ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మాట్లాడకండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండగలిగితే వారంతా సులభంగానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ వారంలో 54శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకుమిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :- శనికి జపము, నల్ల నువ్వుల దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. గోవును నిత్యము చూసి నమస్కారం చేయండి.

సింహరాశి :- ఈ రాశి వారికి సంపదలు భూషణములు ధనము ఇలాంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు మకర సంక్రమణం తరువాత మీ శత్రువుల లో సైతం మీరు మంచి పేరు సంపాదించుకుంటారు. శత్రువులు నాశనం కావడం కంటే శత్రు భావం నాశనం అవ్వడం ముఖ్యం. ఆ స్థితిని మీరు ఈ వారంలో అనుభవిస్తారు. అయితే అగౌరవ పడే కొన్ని సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత మీ ప్రయత్నం ముందుకు వెళుతూ ఉంటుందో అంత కూడా గౌరవానికి భంగం కలుగుతుంది. రవి,గురు శుక్ర శనులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా మాట్లాడగలిగినట్లయితే పనులన్నీ సులువుగా చక్కగా నెరవేరుతాయి. ఎక్కడెక్కడ మీకు అనుకూలత తక్కువ ఉంటుంది అనేది మీకు సూచనా మార్గం అందుతుంది. దాన్ని మీరు గ్రహించాలి మీకు అలాంటి శక్తి సామర్ధ్యాలు కూడా ఉన్నాయి. రాహుకేతువుల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. దానివల్ల కూడా గౌరవ భంగం జరిగే అవకాశం ఉంది ఏదైతేనేం ఈ వారంలో 54 శాతం శుభఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం :- రాహు కేతువులకు పూజలు చేయించండి కాలసర్ప దోషం పూజ చేయిస్తే మంచిది.

కన్యారాశి :- ఈ రాశి వారికి ఈవారం ఆర్థికంగా బాగుంటుంది. శత్రువులు సహజంగానే కొనసాగుతున్నారు. సర్వసంపదలు పొందడానికి కూడా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. ప్రయత్నంలో కొంత వరకు కృతకృత్యులు అవుతారు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది . ఇంతకుముందు మీరు ఏవేవి అయితే సాధించలేము అనుకున్నారు అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు చక్కని సాధన సంపత్తిని కలిగిస్తాయి. మీరు ఎంత లబ్ధి పొందిన కొంత నష్టం లేదా వ్యయం తప్పదు. మీ సొంత ఆలోచన అయితే పనిచేయవు. అని మీరు ఇతరుల మీద కొంత ఆధారపడి అది ప్రత్యేకించి గురువు మీద ఆధారపడి నట్లయితే మీకు కొంత వరకు మంచి జరుగుతుంది. ఈ రాశివారికి ఈ వారంలో 36 శాతం ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. చిత్త 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సూర్య నమస్కారాలు, యోగ సాధన చేయడం మంచిది. కుజ శని గ్రహాల జపం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. బుధవార నియమాలు పాటించండి.

తులా రాశి :- ఈ రాశి వారికి ధనలాభము, శత్రు జయం చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కానీ వాటిని వినియోగించుకోలేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా. గురు స్థితి వల్ల ఆలోచన కూడా స్థిరంగా ఉండదు. మీరు ఉత్సాహాన్ని లోపలినుండి తెచ్చుకోవాలి తప్ప బయట మీకు ఏ కోశానా ప్రోత్సాహం లభించదు. సహజంగా వీరు సమతుల్య స్థితిని పొందగలుగుతారు కానీ శని రాహు కేతువు ల యొక్క ప్రభావము వీరిని అనారోగ్యం పాలు చేస్తుంది. శుక్రగ్రహ అనుకూలత మీకు సగానికి సగం బలాన్ని చేకూరుస్తుంది. దాన్ని మీరు పూర్తిగా వినియోగించుకో గలిగితే మీరు ఏదైనా సాధించవచ్చు. మీకు ఈ వారం లో 27శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్తా 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలరు. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. విశాఖ 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం: శనికి జపము హోమము నల్ల నువ్వులు దానం చేయండి తైల అభిషేకం చేయించండి. శని స్తోత్రం పఠించండి. రుద్రాభిషేకము విశేష ఫలితము.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారు కుటుంబంతో హాయిగా ఉండే అనుకూల పరిస్థితులు, ధనలాభము కనిపిస్తుంది అయితే శత్రుపీడ నుంచి మీరు తప్పించుకోలేరు అలాగే గురు గ్రహము కూడా మీకు అనుకూలంగా లేక పోవటం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. అయితే మీరు వల్ల జరిగే చిన్నచిన్న శుభకార్యాలకు హాజరు కావడం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ వారం మీకు ఆర్థికంగా కూడా బాగా వుంటుంది.కుజ ప్రభావం చేత శత్రువులు కూడా మీకు ఎక్కడపడితే అక్కడ ఉంటారు వారి నుండి దూరంగా ఉండాలి ప్రయత్నించండి. మాట మీద నిలబడండి మంచి మాటను పొందండి మంచి పేరు పొందగలుగుతున్నారు. మీకు క్రమక్రమంగా మంచి రోజులు వస్తున్నాయి అనడానికి సంకేతాలుగా ఉపయోగపడతాయి. మీకు ఈ వారంలో 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనురాధ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :- ఏకాగ్రత కోసం ప్రయత్నించండి. ధ్యానం మీకు ఉపకరిస్తుంది. ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లం వేసి ఆవుకు తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

ధను రాశి :- ఈ రాశి వారికి లాభము, మృష్టాన్న భోజనం, స్వర్ణాభరణాలు, సుఖజీవితం చివరిగా ధనలాభం ఇవన్నీ వీరిని గొప్ప ఆలోచన పరంగా తయారు చేసి మంచి మార్గంలోకి నడిపిస్తాయి. వీరికి బుధ శుక్రులు అనుకూలంగా ఉండటం చాలా ఉత్సాహం సంతోషం ఎక్కువ అన్నమాట అదే భావన మీకు మరింత మంచిది. కుటుంబ ఆనందం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. దానికి తగిన ప్రతిఫలాన్ని మానసికంగా పొందగలుగుతారు. గురుడి ప్రభావం చేతవ్యాపారంలో గానీ విద్యా వ్యాసంగం విషయంలో గానీ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే, అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ వారంలో 45 శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మూలా నక్షత్రం జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం: శని దోషం పోవడానికి జపం చేయించండి హోమాదులు జరిపించండి దానధర్మాలు చేయండి.

మకర రాశి :- ఈ రాశి వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు. మీరు ఈ వారంలో స్థానచలనం పొందే అవకాశం ఉంది. అయితే అది మంచికా చెడుకా, ఆ నిర్ణయం సరైనదా కాదా అన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీకు శత్రు పీడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఏదైనా ఒక పనిని ఉత్సాహంగా మొదలుపెట్టిన అప్పటికే అది మీకు వ్యతిరేకంగానే నెరవేరుతుంది. అయితే మీకు శుక్ర గ్రహ స్థితి బాగా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ వారంలో మీకు 27శాతం మాత్రమే శుభపరిణామాలు ఉన్నాయి. శని గ్రహ స్థితిని బట్టి చూస్తే మీరు ఈ వారంలో ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి. భగవన్నామస్మరణ వల్ల అనేక సమస్యల నుంచి బయటపడ గలము అనే విషయాన్ని గుర్తించి వ్యవహరించండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. శ్రవణం నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ధనిష్ఠ 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: శని గురు జపం చేయించండి గ్రహమఖం (యజ్ఞం ) చేస్తే చాలా మంచిది. గురు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠనం మరువకండి.

కుంభరాశి: ఈ రాశి వారు ఈ వారం కూడా ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయాలి. చేసే ఏ పనిలోనూ సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు సరికదా అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మకర సంక్రమణం తర్వాత మారుతున్న రవి కూడా మీకు ఆర్ధికంగా ఎటువంటి పురోగమనాన్ని ఇవ్వలేడు. అంతేకాకుండా రాజదండన, స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. మీరు ఎప్పుడు, ఎలా ఇబ్బందులకు గురి చేద్దామా అంటూ శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు. కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిద. ధనమైతే వస్తుంది కానీ అంతకంతా ఖర్చు అయి పోతున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తంమీద కొంత మధ్యమంగా ఈ వారం నడుస్తుంది. ఈ వారం మీకు 36% మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి.ధనిష్ఠ 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. శతభిషం నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- శని జపం చేయించండి. నవగ్రహ దర్శనం. నిత్యము రుద్రాభిషేకము చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గో సందర్శనము శివ సందర్శనము ప్రతిరోజు మీ జాతకానికి చాలా అవసరం.

మీన రాశి :- ఈ రాశి వారికి 72 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఎవరికి కూడా ఇంత శాతం శుభ ఫలితాలు లేవు. ఈ వారంలో పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుజ, కేతుల అనుకూలత లేదు కానీ తదితర గ్రహాలన్నీకూడా సహకరించడం వల్ల విశేష ఫలితాలు పొందగలుగుతున్నారు. సంతోషము ధనము ఒకటేమిటి ఇవన్నీ వీరు పొందడమే కాదు ఇతరులకు కూడా పొందేటట్లు చేస్తారు. వీరిలో ఒక దుర్గుణం ఉంది ఎంత వచ్చినా సరే పదిమందికి పెట్టడానికి ఇష్టపడరు . దానివల్ల ఉన్న సొమ్మని ఖర్చు పెట్టక తాను తినక అనుభవించే యోగ లేకుండా పోతారు. ఇదొక్కటే మార్చుకుంటే మీరు జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు కలిసివస్తాయి. పదిమంది చేరి అభినందించే మంచి ఉద్యోగం గాని ఆర్థిక లావాదేవి లేదా చదువు పొందే అవకాశాలు ఈ వారంలో వీరికి ఉన్నాయి. ప్రతికూలతలు చాలా తక్కువ. అయితే ఇటువంటి సమయంలో కూడా మీకు శత్రువులు వృద్ధి చెందుతారు. జాగ్రత్తగా వ్యవహరించండి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. రేవతీ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా బావుంటుంది అని చెప్పొచ్చు.

పరిహారం :- కుజునకు పూజలు చేయించండి.సుబ్రహ్మణ్యం పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.




Next Story