ఈ ఏడాది ఆసియా కప్ లేదని తేల్చి చెప్పిన సౌరవ్ గంగూలీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2020 5:28 AM GMTఈ ఏడాది ఆసియా కప్ టీ20 సిరీస్ ఉండదని బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. సెప్టెంబర్ నెలలో నిర్వహించాల్సిన ఆసియా కప్ టోర్నీని కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేస్తున్నామని తెలిపాడు. పాకిస్థాన్ ఈ సిరీస్ ను నిర్వహించాల్సి ఉండగా, పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా శ్రీలంకలో నిర్వహించాలని భావించారు. దీనిపై గంగూలీ తాజాగా స్పందించాడు. ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో మాట్లాడిన గంగూలీ ఆసియా కప్ క్యాన్సిల్ అయింది, సెప్టెంబర్ లో నిర్వహించాలని అనుకున్న ఈ టోర్నమెంట్ ఇక లేనట్లే అని స్పష్టం చేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్ ను 2022లో నిర్వహించనుంది. ఈ ఏడాది క్యాన్సిల్ అయిన టోర్నమెంట్ ను శ్రీలంక 2021లో నిర్వహించనుంది. పీసీబీ ఛీఫ్ ఎహ్సాన్ మని కూడా ఈ ఏడాది ఆసియా కప్ లేనట్లేనని తెలిపాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నమెంట్ ను వచ్చే ఏడాది నిర్వహించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్ ను నిర్వహించడం చాలా కష్టం.. మేము శ్రీలంకకు మార్చుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ లు జరగడం అంత శ్రేయస్కరం కాదని అన్నాడు. టోర్నమెంట్ రద్దు వెనుక ఎటువంటి పాలిటిక్స్ లేవని మని తెలిపాడు.
'మేము ఈ ఏడాది టోర్నమెంట్ ను నిర్వహించాలని అనుకున్నాము.. కరోనా వైరస్ కేసులు పాకిస్థాన్, యుఎఈ, దక్షిణ ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నిటిలోనూ శ్రీలంకలో తక్కువ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది శ్రీలంక ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తే.. వచ్చే ఏడాది మేము నిర్వహించాలన్న ప్రపోజల్ ను పెట్టాము.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఇందుకు అంగీకరించింది. ఎటువంటి రాజకీయాలు లేవు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ టోర్నమెంట్ ను వాయిదా వేయడమే మంచిది అని అందరూ భావించారు' అని చెప్పుకొచ్చాడు మని.
అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని అనుకున్న టీ20 వరల్డ్ కప్ కూడా ఈ ఏడాది జరిగే అవకాశాలు లేవని స్పష్టమైంది. ఇక ఆసియా కప్ ను కూడా రద్దు చేయడంతో ఐపీఎల్ ను నిర్వహించేందుకు అన్ని తలుపులు తెరుచుకున్నాయి. కానీ భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.
భారత జట్టును క్రికెట్ గ్రౌండ్ లో ఎప్పుడు చూసే అవకాశాలు ఉంటాయని గంగూలీని అడగ్గా 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత జట్టు గ్రౌండ్ లోకి ఎప్పుడు అడుగుపెడుతుంది అన్నది చెప్పలేకపోతున్నాము.. పరిస్థితుల్లో మార్పు వస్తే మంచిది. ప్రస్తుతం స్టేడియంలను ఓపెన్ చేసినప్పటి కీ కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆటగాళ్లు ట్రైనింగ్ కు వెళ్లడం లేదని చెప్పారు. పరిస్థితి అదుపు లోకి వచ్చిన తర్వాతనే ఏ విషయాన్నైనా చెప్పగలం. ఆటగాళ్ల సేఫ్టీ చాలా ముఖ్యం. అయిదారు నెలల పాటూ క్రికెట్ లేకుండా ఉండడం అంటే చాలా కష్టమైన విషయమే.. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదీ చెప్పలేని పరిస్థితి' అని తెలిపాడు.
ఇక ఐపీఎల్ గురించి మాట్లాడుతూ టీ20 వరల్డ్ కప్ పై ఐసీసీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఐపీఎల్ ఉంటుందో లేదో చెప్పగలమని తెలిపాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ రద్దయితే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ జరగకపోతే బిసిసిఐ 4000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. భారత్ కు ఐపీఎల్ ఎంతో ముఖ్యమైన టోర్నమెంట్. భారత్ లోని అయిదు గ్రౌండ్ లలో టోర్నమెంట్ ను నిర్వహించాలని అనుకుంటూ ఉన్నాము. అది వీలు పడకపోతే విదేశాలలో నిర్వహించడమే మనకున్న ఆప్షన్ అని క్లారిటీగా చెప్పాడు గంగూలీ.