బీజేపీ నుంచి అశీష్ గౌడ్ సస్పెండ్..!
By Newsmeter.Network Published on 2 Dec 2019 1:48 PM GMTముఖ్యాంశాలు
- అశీష్ ప్రవర్తనపై 'బీజేపీ' వేటు
పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌పై బీజేపీ వేటువేసింది. బిగ్ బాస్ రెండో సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న ఓ యువతిపై ఆయన దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో బీజేపీ నుంచి సస్పెన్షన్ చేస్తున్ననట్లు పార్టీ ప్రకటించింది. మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని.. మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్లో శనివారం అర్థరాత్రి ఆశీష్ గౌడ్ సదరు యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని సదరు యువతి పేర్కొంది. బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆశీష్ వేధింపులతో భయంతో తాను తప్పించుకున్నానని తెలిపింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె పోలీసుల ముందు స్పష్టం చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆశిష్ గౌడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.