చిరిగిన షూతోనే తొలి టెస్టు ఆడిన నెహ్రా
By తోట వంశీ కుమార్ Published on 5 May 2020 7:47 PM ISTటీమ్ఇండియాకు దొరికిన అతికొద్ది లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో ఆశిష్ నెహ్ర ఒకరు.. భారత జట్టు తరుపున 17 టెస్టుల్లో 44, 120 వన్డేల్లో 157, 27 టీ20 ల్లో 34 వికెట్లను పడగొట్టాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన ఈ టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకాశ్ చోప్రాతో కలిసి లైవ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను భారత జట్టుకు ఎంపికైన తొలి రోజులను అభిమానులతో పంచుకున్నాడు.
1999లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశానని, అయితే.. ఆ సమయంలో తన వద్ద కేవలం ఒకే జత షూస్ మాత్రమే ఉండేవని చెప్పుకొచ్చాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. రంజీట్రోఫిలో వినియోగించిన షూస్‌తోనే తొలి టెస్టులో బరిలోకి దిగానన్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చినప్పుడు తన షూస్‌ను కుట్టుకునేవాడినని తెలిపాడు.
'1999లో టెస్టు అరగ్రేటం చేశా. అప్పుడు నా వద్ద ఒక జత బూట్లు మాత్రమే ఉండేవి. రంజీ ట్రోఫీలో ఆడిన వాటితోనే తొలి టెస్టుకు సిద్ధమయ్యా. అయితే మైదానంలో పరుగులు తీయడం వల్ల అవి త్వరగా పాడైపోయేవి. ఇన్నింగ్స్ మధ్య విరామం లభించినప్పుడు చిరిగిన భాగాలను కుట్టుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేవాడినని అని నెహ్రా పేర్కొన్నాడు.
ధోనిలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, ఐపీఎల్ సాధ్యం కాని పక్షంలో ధోని తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ అద్భుతంగా కీపింగ్ చేస్తున్నప్పటికి ధోని ప్రత్యామ్నాయం మాత్రం రిషబ్ పంత్‌నే నని నెహ్రా తెలిపాడు.