ఎన్‌పీఆర్‌కు, ఎన్‌ఆర్సీకి తేడా లేదు.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
By Newsmeter.Network Published on 25 Dec 2019 5:05 PM ISTహైదరాబాద్: ఎన్‌పీఆర్‌కు, ఎన్‌ఆర్సీకి తేడా లేదని ఎమ్‌ఐమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మత ప్రాతిపదికన మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముస్లిం యునైటెడ్ కమిటీ నాయకులు భేటీ అయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషా ఖాద్రీ ఈ భేటీలో పాల్గొన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేయొద్దని అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు లేఖ ఇచ్చారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో ముందుకెళ్తామన్నారు. ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరామని అసదుద్దీన్ తెలిపారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామన్నారు. ఎల్లుండి నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. అన్ని పార్టీలను సభకు ఆహ్వానిస్తామని తెలిపారు.