ఎంజీఆర్ అంటే అరవింద స్వామి.. అరవింద స్వామి అంటే ఎంజీఆరే..!
By అంజి Published on 18 Jan 2020 1:18 PM IST'రోజా'లో గులాబీ పువ్వంత సౌకుమార్యం, 'ధ్రువ'లో గులాబి ముల్లంత కాఠిన్య క్రౌర్యం... అరవింద స్వామి విలక్షణ అభినయ కౌశలానికి ఈ రెండు వైవిధ్యపూరిత సినిమాలు నిలువెత్తు నిదర్శనాలు. ఇప్పుడు ఆ సౌతిండియన్ మిల్కీ హ్యాండ్ సమ్ తమిళ తెర నవమన్మథుడు, తొట్టతొలి సూపర్ స్టార్ ఎంజీఆర్ లా కనిపించబోతున్నాడు. అభినేత్రి వంటి సినిమాను తీసిన డైరెక్టర్ విజయ్ తీస్తున్న పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ కి ఎంజీఆర్ పాత్ర అత్యంత కీలకం. ఎందుకంటే ఎంజీఆర్ జయలలితల ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమెస్ట్రీ అలాంటిది. ఎంజీఆర్ జయలలితకు సినిమాల్లో, పాలిటిక్స్ లో గురువు, సఖుడు, మార్గదర్శకుడు. అందుకే అలాంటి రోల్ ఎవరు చేయాలన్నది అసలు ప్రశ్న. అయితే జయలలిత బయోపిక్ చేయాలనుకున్న మరుక్షణం నుంచి దర్శకుడు విజయ్ ఎంజీఆర్ రోల్ కి అరవింద స్వామినే మనసులో ఫిక్స్ చేసుకున్నాడు. అరవింద స్వామి తప్ప మరెవరూ ఎంజీఆర్ పాత్రలో వెలుగులీనలేరన్నది ఆయన దృఢ నమ్మకం. అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అరవింద స్వామికి తప్ప మరెవరికీ లేదన్నని ఆయన విశ్వాసం.
ఎంజీఆర్ 103వ జయంతి సందర్బంగా అరవింద స్వామి ఎంజీఆర్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు విజయ్ ఎంపికను అందరూ అభినందిస్తున్నారు. అరవింద స్వామి పలు లుక్ టెస్టులు చేయించుకున్న తరువాత తాజా లుక్ విషయంలో ఫిక్సయ్యారు. అరవింద్ ఎంజీఆర్ సినిమాలను చూశారు. ఆయన మానరిజాలను పట్టేశారు. ఆఖరికి ఎంజీఆర్ గా పరకాయప్రవేశం చేశారు. మేకప్ మ్యాన్ పట్టణం రషీద్ తో ఎన్నో సార్లు సిట్టింగులు వేసిన తరువాత సంతృప్తికరమైన లుక్ విషయంలో ఫిక్సయ్యారు.
ఇక జయలలితగా రెబెల్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాలో కంగనా, అరవింద్ స్వామిలు కలిసి నటించిన సీన్లు హైలైట్ కాబోతున్నాయి. “జయలలిత సినీ, రాజకీయ జీవితంలో ఎంజీఆర్ ది అత్యంత ప్రధానమైన పాత్ర. ఒకరకంగా జయలలిత హీరోయిన్ అయితే ఎంజీఆర్ హీరో. తెరమీద కూడా ఈ నటీనటులిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉంటుంది” అంటున్నారు దర్శకులు విజయ్. ఒక సినీ హీరోయిన్ నుంచి పదహారణాల పాలిటీషియన్ గా జయలలిత పరివర్తన సినిమాలో హైలైట్ కాబోంతోందని విజయ్ నమ్ముతున్నారు.