ఢిల్లీ సీఎంగా ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ముచ్చటగా మూడో సారి అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆప్‌కు 53.57శాతం, బీజేపీకి 38.51 శాతం, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు లభించాయి.

కాగా బుధవారం ఉదయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అసెంబ్లీని రద్దు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను కేజ్రీవాల్‌ కలిశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను కోరారు. 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆప్‌ ఎల్పీ నేతగా అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. 16వ తేదీన జరిగే కార్యక్రమంలో పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 70 సీట్లకు 62 సీట్లు సాధించింది. మరో ఎనిమిది సీట్లను బీజేపీ గెల్చుకుంది. కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మొదటగా ఫిబ్రవరి 14న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేస్తారని అందరూ భావించారు.

అయితే గత 2015 సంవత్సరం ఫిబ్రవరి 14న ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు 2013లో తొలిసారిగా ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఆప్‌ ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య విబేధాలు చెలరేగాయి. దీంతో 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.