ఢిల్లీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అభిమానుల అత్యుత్సాహ ఫలితంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నామినేషన్ ను దాఖలు చేయలేకపోయారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ ర్యాలీకి ఆప్ కార్యకర్తలు, అభిమానులు చీపుర్లతో హంగామా చెయ్యడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ఆయన సరైన సమయానికి ఎన్నికల కార్యాలయానికి చేరుకోలేకపోయారు. మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్నికల కమిషనర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేయాల్సి ఉండగా.. అ సమయానికి కేజ్రీవాల్ ఇంకా రోడ్‌షోలోనే ఉన్నారు.

ఓపెన్ టాప్ జీపుపై భార్య సునీతా కేజ్రీవాల్, ఇద్దరు పిల్లతో కలిసి వాల్మీకి ఆలయం నుంచి కేజ్రీవాల్ రోడ్‌ షో ప్రారంభమైంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు సాగింది. ఫలితంగా సకాలంలో కార్యాలయానికి చేరుకోలేకపోయారు. అయితే నామినేషన్ పేపర్లు దాఖలు చేయలేకపోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. రోడ్‌షోలో సీఎం కేజ్రీవాల్ వెంట ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా ఉన్నారు.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఇక్కడ ఎన్నికలు జరిగి, 11న ఫలితాలు వెలువడుతాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో జయభేరీ మోగించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెబుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.