ఫిబ్రవరి 14 లవర్స్‌ డేతో కేజ్రీవాల్‌కు విడదీయరాని బంధం.. ఎందుకంటే..

By సుభాష్  Published on  11 Feb 2020 8:55 AM GMT
ఫిబ్రవరి 14 లవర్స్‌ డేతో కేజ్రీవాల్‌కు విడదీయరాని బంధం.. ఎందుకంటే..

ఢిల్లీలో మరోసారి చీపురు ఊడ్చిపారేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. కమలం పార్టీని సైతం ఢీకొట్టి సత్తాచాటింది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఎగ్జిట్‌పోల్‌ అంచనాలను నిజం చేస్తూ భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది ఆప్‌. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారిగా ఢిల్లీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికులకే కాదు.. కేజ్రీవాల్‌కు కూడా విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో మొదటిసారిగా ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పడింది. బీజేపీ 31, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 8 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఆమ్‌ ఆద్మీ కాంగ్రెస్‌తో చేతులు కలిపి కేజ్రీవాల్‌ సర్కార్‌ను ఏర్పాటు చేశారు. కాగా, కాంగ్రెస్‌తో పలు విబేధాల కారణంగా 2014 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో మళ్లీ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆప్‌ అధికారంలోకి వస్తుండటంతో ఫిబ్రవరి 14వ తేదీనే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14 కేజ్రీవాల్‌కు బాగానే కలిసి వస్తోందంటున్నారు.

సంబరాలు జరుపుకోండి.. బాణాసంచాలు కాల్చకండి

కాగా, ఆప్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సంబరాలు జరుపుకొంటున్న కార్యకర్తలకు కేజ్రీవాల్‌ ఓ సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి.. కానీ బాణాసంచాలు మాత్రం కాల్చకండి అంటూ సూచించారు. బాణా సంచాలు కాల్చే బదులు స్వీట్లు పంచుకోండని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు ఆప్‌ పార్టీ శ్రేణులు బాణాసంచలు కాల్చకుండా బెలూన్లను గాల్లోకి వదిలి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Next Story