తెలంగాణ: లడఖ్‌లో ఆర్మీ జవాను మృతి.. మృతదేహాన్ని పంపేందుకు అంగీకరించని అధికారులు

By సుభాష్  Published on  19 Oct 2020 2:43 PM IST
తెలంగాణ: లడఖ్‌లో ఆర్మీ జవాను మృతి.. మృతదేహాన్ని పంపేందుకు అంగీకరించని అధికారులు

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జవాన్‌ షకీర్‌ హుస్సేన్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అధికారులు అంగీకరించడం లేదు. ఆయన భౌతికకాయానికి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ తేలిందని, అందుకే మృతదేహాన్ని స్వగ్రామానికి పంపలేమని, శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో షకీర్‌ హుస్సేన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ జిల్లాకు చెందిన షకీర్‌ 19 సంవత్సరాలుగా లడక్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన అక్కడ కొండచరియలు విరిగిపడటంతో షకీర్‌ మృతి చెందారు. ఆర్మీ వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక హుస్సేన్‌ మృతదేహాన్ని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీనగర్‌కు వెళ్లనున్నారు. షకీర్‌ హుస్సేన్‌ 2001లో ఆర్మీలో చేరారు. షకీర్‌ మృతిపై సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విచారణం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. షకీర్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

కాగా, షకీర్‌ మృతికి రెండు రోజుల కిందట తండ్రి హుస్సేన్, తల్లి జంషీద్‌ సుల్తానా, భార్య నిఖిత్‌ఫాతిమాతో ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేశ భక్తితో ఆర్మీలో చేరిన షకీర్‌ హుస్సేన్‌ ఎప్పుడు కాగజ్‌నగర్‌కు వచ్చిన అందరితో కలిసి ఉండేవాడని, ఆర్మీలో విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమైన విషయమై అతని స్నేహితులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవాను మరణ వార్తలో కాగజ్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story