'అర్జున్ సుర‌వ‌రం' రివ్యూ

By Newsmeter.Network  Published on  29 Nov 2019 7:29 AM GMT
అర్జున్ సుర‌వ‌రం రివ్యూ

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం అర్జున్ సుర‌వ‌రం. ఈ సినిమాకి టి.ఎన్. సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే నెల‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ రోజు (న‌వంబ‌ర్ 29) అర్జున్ సుర‌వ‌రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇది త‌న కెరీర్ లో స్పెష‌ల్ మూవీ అని, ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని... గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు. మ‌రి.. అర్జున్ సుర‌వ‌రం ఆక‌ట్టుకున్నాడా..? నిఖిల్ న‌మ్మ‌కం నిజ‌మైందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ - అర్జున్ సుర‌వ‌రం (నిఖిల్) 99 టీవీలో రిపోర్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. బి.బి.సి ఛాన‌ల్ లో వ‌ర్క్ చేయాలి అనేది అత‌ని డ్రీమ్. ప‌బ్ లో డ్ర‌గ్స్ అమ్ముతున్నార‌ని తెలుసుకుని అక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి స్టింగ్ ఆప‌రేష‌న్ చేస్తుంటే క‌థానాయిక లావ‌ణ్య ప‌రిచ‌యం అవుతుంది. ఆ.. ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతున్న టైమ్ లో ఊహించ‌ని విధంగా నకిలీ స‌ర్టిఫికెట్ల కేసులో పోలీసులు అర్జున్ ని అరెస్ట్ చేస్తారు. అత‌నికి ఏమాత్రం సంబంధం లేక‌పోయినా ఈ కేసులో ఇరుక్కుంటాడు. దీని వెన‌క పెద్ద స్కాం ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి అర్జున్ ఏం చేసాడు..? న‌కిలీ స‌ర్టిఫికెట్ స్కాం వెన‌క ఉన్న‌ది ఎవ‌రో ఎలా క‌నిపెట్టాడు..? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ - నిఖిల్ రిపోర్ట‌ర్ అర్జున్ సుర‌వ‌రం పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసారు. ఇక లావ‌ణ్య కూడా త‌న పాత్ర ప‌రిథి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. ఈ సినిమాకి హైలెట్ అంటే క‌థ‌, క‌థ‌నం అని చెప్పచ్చు. ఎంచుకున్న క‌థ‌ని ఎక్క‌డా బోర్ అనే ఫీల్ రాకుండా ఇంట్ర‌స్టింగ్ ట్విస్టుల‌తో తెర‌కెక్కించారు. నిఖిల్ ఫ్రెండ్ గా న‌టించిన స‌త్య సంద‌ర్భానుసారంగా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు.

స్కూల్ బిల్డింగ్ కూలిపోవ‌డంతో పిల్ల‌లు చ‌నిపోయిన‌ సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉండేలా డైరెక్ట‌ర్ సంతోష్..తెర‌కెక్కించారు. దీనికంత‌టికి కార‌ణం న‌కిలీ స‌ర్టిఫికెట్లతో జాబ్ సంపాదించ‌డం అని చూపించ‌డం బాగుంది. తెర పై నిఖిల్ క‌ష్టం క‌న‌ప‌డితే.. తెర వెన‌క డైరెక్ట‌ర్ ఈ స్ర్కిప్ట్ పై ఎంత హామ్ వ‌ర్క్ చేసారో తెలుస్తుంది. ఎక్క‌డా లాజిక్ మిస్ కాకుండా చాలా బాగా డీల్ చేసారు.

ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. సెకండాఫ్ లో అక్క‌డ‌క్క‌డా గ్రాఫ్ కొంచెం త‌గ్గుతుంద‌ని అనిపించినా క్లైమాక్స్ మాత్రం ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డం ఆక‌ట్టుకుంటుంది. క‌థ అంతా సీరియ‌స్ గా సాగ‌డం, రెగ్యుల‌ర్ సినిమాల్లో ఉండే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోవ‌డం మైన‌స్. మొత్తానికి ఒక్క మాట‌లో చెప్పాలంటే... అర్జున్ సుర‌వ‌రం ఆక‌ట్టుకున్నాడు.

ప్ల‌స్ పాయింట్స్

- నిఖిల్ న‌ట‌న‌

- క‌థ‌, క‌థ‌నం

- స‌త్య కామెడీ

- సంతోష్ డైరెక్ష‌న్

- మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్

- సీరియస్ గా సాగే క‌థ‌,క‌థ‌నం

- క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోవ‌డం

రేటింగ్ - 3/5

Next Story