మీరు శాఖాహారులా..? అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి
By తోట వంశీ కుమార్ Published on 9 March 2020 6:25 PM ISTమీరు శాఖాహారులే గనుక అయితే, ఈ వీడియో తప్పక చూడాల్సిందే. నేటి రోజుల్లో కలుషితం విపరీతంగా పెరిగిందంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే క్రమంలో పచ్చి కూరగాయలు తినేవారు.. ఇలా చిన్నా, పెద్దా అన్న తేడా ఏ మాత్రం లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ వీడియోపై ఓ లుక్కేయాల్సిందే. ఏం చేద్దాం ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి చేసిన ఘనకార్యం అటువంటిది. సహజంగా ఎవరైనా కూరగాయలు కొనేందుకు బజారుకెళ్తే కాసిన్ని టమోటాలు, పచ్చిమిర్చిని బుట్టలో వేసుకోందే తిరిగి ఇంటిబాట పట్టరు. మరీ ముఖ్యంగా ఈ రూల్‌ను మధ్య తరగతి ప్రజలు విధిగా పాటిస్తారు. కనీసం పచ్చడి మెతుకులతోనైనా పూట గడుస్తుందిలే అన్నది వారి అంతరాలోచన.
ఇలా ఎంతో మందికి కూరగాయలు అనగానే మొదటిగా గుర్తుకొచ్చే టమోటా, పచ్చిమిర్చిలను ఓ వ్యక్తి ముక్కులు పగిలేలా దుర్గంధం వెదజల్లే మురుగు కాలువ నుండి బయటకు తీశాడు. ఏకంగా మురుగు కాలువ నుండి టమోటా, పచ్చి మిరపకాయలను తీసిన వ్యక్తి మతి స్థిమితం లేని వాడై ఉంటాడనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఏకంగా కూరగాయలు అమ్మే అతనే ఈ ఇటువంటి ఘనకార్యానికి పాల్పడ్డాడు. అయితే, కూరగాయలు అమ్మే క్రమంలో అటుగా వెళ్తూ బండిమీద టమోటా, పచ్చిమిర్చి మురుగు కాల్వలో పడ్డాయో.. లేక పనికిరానివిగా భావించి ఎవరో డ్రైనేజీలో వేసిన టమోటా, పచ్చిమిర్చిని తిరిగి అమ్మేందుకు ఏరుకుంటున్నాడో తెలీదు కానీ, రోజా మొక్క ముల్లు గుచ్చుకోకుండా అంటు కట్టినట్టు.. టమోటాలకు ఏ మాత్రం దెబ్బతగలకుండా చాలా జాగ్రత్తగా మురుగు కాలువలో నుండి బయటకు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వీడియోలను చూసిన వారు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి కూరగాయలను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరైతే కూరగాయలు కొనకుండా వెనుదిరుగుతున్నారు. కొందరు వ్యాపారులు వారి స్వలాభం కోసం మా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
[video width="396" height="720" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/fruits.mp4"][/video]