ఏపీ టీడీపీలో మిగిలేది ఆ ఐదుగురేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 7:30 AM GMT
ఏపీ టీడీపీలో మిగిలేది ఆ ఐదుగురేనా?

ఏపీలో రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్కాయి. ఓవైపు ప్ర‌తిప‌క్షం ఇసుక‌, క‌రెంట్ కోత‌లు అంటూ ఆందోళ‌న చేస్తుంటే...ఇటు అధికార ప‌క్షం కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు ప‌దును పెట్టింది. రాబోయే పంచాయ‌తీ ఎన్నిక‌లతో పాటు 2024 ఎన్నిక‌లే టార్గెట్‌గా వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది.

టీడీపీకి పట్టున్న కృష్ణా జిల్లా నుంచే తొలి స్కెచ్‌ వైసీపీ గీసింది. ఇందులో భాగంగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీ మారుతున్న‌ట్లు తెలుస్తోంది, అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల 29న వంశీ వైసీపీలో చేర‌తారు.

కృష్ణాలో సామాజిక‌వ‌ర్గాల స‌మీక‌ర‌ణాల్లో భాగంగానే వంశీని వైసీపీలోకి తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. దేవినేని ఉమా ఆధిప‌త్యం స‌హించ‌లేని నేతలు వ‌రుస‌గా టీడీపీని వీడుతున్నారు. రాబోయే రోజుల్లో బోండా ఉమ‌తో పాటు పలువురు నేత‌లు కూడా పార్టీని వీడే చాన్స్ క‌నిపిస్తోంది.

ఇటు టీడీపీ త‌ర‌పున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 16 మంది ఇప్పుడు ప‌క్క చూపులు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు బీజేపీలో చేరుతార‌ని తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు ఓ ఎమ్మెల్యేల బ్యాచ్ వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

గుంటూరు, అనంత‌పురంతో ప‌శ్చిమ‌గోదావ‌రి నుంచి గెలిచిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీ లేదా వైసీపీనా తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌. ఇటు గంటాతో పాటు చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా బీజేపీ వైపు చూస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఒంగోలు వెళ్లిన సుజ‌నాను క‌ర‌ణం క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మొత్తానికి టీడీపీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెంనాయుడు.ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్ మాత్ర‌మే మిగులుతార‌ని.....మిగ‌తా ఎమ్మెల్యేలు పార్టీ మారుతార‌ని జోరుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కంటే ముందే ఈ కండువాల మార్పిడి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌నే టాక్ న‌డుస్తోంది. టీడీపీ ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో చంద్ర‌బాబు 16 నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు పెట్టారు. ఈ లోపే అక్క‌డ భారీగా నేత‌లు జంప్ కావ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది .

Next Story