Fact Check : అమెరికన్లు తమ కోపాన్నంతా ట్రంప్ పై అలా తీర్చుకుంటూ ఉన్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 4:07 AM GMT
Fact Check : అమెరికన్లు తమ కోపాన్నంతా ట్రంప్ పై అలా తీర్చుకుంటూ ఉన్నారా.?

జార్జ్ ఫ్లాయిడ్ మరణం పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజాతీయులపై పోలీసుల దాష్టీకాలు ఆగాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జాత్యహంకార ఘటనలపై కనీసం మాట్లాడడం లేదని ఎంతో మంది అమెరికన్లు ఆరోపిస్తున్నారు. దేశంలో జాత్యహంకారం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతోందని.. పోలీసులు దారుణంగా ప్రవర్తించడమే కాకుండా.. సమానత్వం నశిస్తోందంటూ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ తీరుకు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ట్రంప్ ను పోలిన ఓ బొమ్మను అమెరికన్లు కొట్టడం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. 'ఎంతో మందిని గుడ్డిగా ఫాలో అయిన డొనాల్డ్ ట్రంప్ పై అమెరికన్లు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి' అంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.



ట్విట్టర్ లోనే కాకుండా ఫేస్ బుక్ లో కూడా ఈ వీడియో వైరల్ అయింది. ట్రంప్ ను పోలిన బొమ్మను పలువురు బలంగా బాదడం ఆ వీడియోల్లో చూడొచ్చు.

T1

‘Story World 2020’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియోను అప్లోడ్ చేసింది. “People Boxing Donald Trump statue After GEORGE MOVEMENT IN AMERICA” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. అమెరికాలో జార్జ్ మూమెంట్ జరుగుతోందని.. అందులో భాగంగా ట్రంప్ బొమ్మపై కోపం తీర్చుకుంటున్నారని అందులో ఉంది.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఈ వీడియోల్లోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ‘people hitting Trump’s dummy అన్న కీ వర్డ్ ను వాడగా.. రెండు వీడియోలకు సంబంధించిన లింక్ లు కనిపించాయి. ‘KyleLEVO’ అనే యూట్యూబ్ ఛానల్ లో అక్టోబర్ 2016న వీడియోను అప్లోడ్ చేశారు. అప్పటి ప్రెసిడెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ బొమ్మతో పాటూ హిల్లరీ బొమ్మను కూడా వీధుల్లో పెట్టి.. పలువురి అభిప్రాయాలను కనుక్కున్నారు.. మీకు నచ్చని వాళ్ళను కొట్టొచ్చు అంటూ అప్పట్లో అక్కడి వాళ్లకు కాంటెస్ట్ లు పెట్టారు.

“The Presidential election between Donald Trump and Hillary Clinton is coming up Nov. 8th, election day. Both candidates are disliked in some form. Trump has several rape allegations and Hillary has her email scandal. So we got a Trump dummy and a Hillary dummy and let people punch the candidates. Share if your tired of this election (sic).” అన్న డిస్క్రిప్షన్ ను వీడియోకు ఉంచారు.

ట్రంప్-హిల్లరీ క్లింటన్ పోలికలు ఉన్న బొమ్మలను అమెరికాలోని చాలా ప్రాంతాల్లో తిప్పి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పటివి కావు.

ఫిలింమేకర్ మైఖేల్ మూర్ లాంటి వాళ్ళు కూడా ఈ వీడియోలను తమ తమ సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేశారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై నిరసనలు తెలుపుతున్న సమయంలో ట్రంప్ డమ్మీపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదంతా 'పచ్చి అబద్ధం'.

Claim Review:Fact Check : అమెరికన్లు తమ కోపాన్నంతా ట్రంప్ పై అలా తీర్చుకుంటూ ఉన్నారా.?
Claim Fact Check:false
Next Story