9,10, ఇంటర్ విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లవచ్చు.. ఏపీ అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు
By సుభాష్ Published on 7 Sept 2020 12:44 PM ISTదేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈనెల 30 వరకు విద్యా సంస్థలన్నీ మూసే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో 9,10 తరగతి విద్యార్థులు, ఇంటర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు మాత్రం అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లే మాస్క్‌లు ధరించాలని, అంతేకాకుండా భౌతిక దూరం తప్పనిసరి అంటూ పేర్కొంది.
ఏపీ అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు :
- సెప్టెంబర్ 21 నుంచి 9,10, ఇంటర్ విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లవచ్చు
- ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి
- సెప్టెంబర్ 21 నుంచి 100 మంది మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి
- సెప్టెంబర్ 20 నుంచి 50 మంది అతిథులతో పెళ్లి వేడుకలు నిర్వహించుకోవచ్చు . అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు
- సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులకు ఎలాంటి అనుమతి లేదు
- 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
కాగా, ఏపీలో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క రోజే 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 70 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,417 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 4,98,125 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో ఇప్పటి వరకు 3,94,019 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 99,689 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.