నిర్భయ దోషుల లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  5 March 2020 10:44 AM GMT
నిర్భయ దోషుల లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

నిర్భయ కేసులో దోషులకు ఎట్టకేలకు నాలుగోసారి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులకు డెత్‌ వారెంట్ల జారీ అనంతరం దోషుల తరపున లాయర్‌ ఏపీ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీరుపై మండిపడ్డారు. దోషులను ఇప్పటికే నాలుగు సార్లు చంపేశారని, ఇంకెన్ని సార్లు చంపుతారంటూ కోర్టుపై మండిపడ్డారు. క్షమాభిక్ష పిటిషన్‌కు సంబంధించి ఆర్టికల్‌ 72ను ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు న్యాయపరమైన పిటిషన్లు ఇంకా మిగిలి ఉన్నాయని, కోర్టు తనను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీడియా ఒత్తిడి ఇప్పటికే వారిని చంపేసింది: ఏపీ సింగ్‌, దోషుల లాయర్‌

''మీడియా ఒత్తిడి ఇప్పటికే వారిని చంపేసింది. ఇప్పటికి దోషులకు మూడుసార్లు ఉరిశిక్ష విధించారు. ఇప్పుడు నాలుగోసారి. ఇది జ్యుడిషియల్‌ మర్డర్‌. దోషులకు ఎన్నిసార్లు ఉరిశిక్ష విధిస్తారు. ప్రజలను ఎన్నిసార్లు చంపుతారు. దోషులంతా ఉగ్రవాదులేమి కాదు. అందరూ చదువుకున్నవాళ్లు. జైల్లో ఉంటూ పరివర్తన చెందుతున్నారు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని జడ్జి నాతో అన్నారు. అంతేకాదు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ దోషులకు న్యాయపరమైన అంశాలు మిగిలే ఉన్నాయి.''. అని దోషుల తరపున లాయర్‌ చెప్పుకొచ్చారు.

ఇక నలుగురు దోషులైన అక్షయ్‌ సింగ్‌ (31), ముఖేష్‌ సింగ్‌ (32), వినయ్‌ శర్మ (26), పవన్‌ గుప్తా (25)లను 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయనున్నారు. దోషులకు ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఇక దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగియడంతో నాలుగో సారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈసారి ఉరిశిక్ష పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story