విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి ఏపీ సర్కార్ మోకాలడ్డుతోందా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 3:02 PM IST
విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి ఏపీ సర్కార్ మోకాలడ్డుతోందా..?!

విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి మోకాలడ్డు

టెక్నాలజీకి కొత్త సర్కారు సహాయ నిరాకరణ

కంపెనీలకు విడుదల కాని రాయితీలు, అద్దెలు

ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సంకేతాలు

ఎపీటా, ఇన్నోవేషన్‌ సొసైటీల్లో సిబ్బందికి ఉద్వాసన

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి విశాఖపట్నమే ప్రధాన కేంద్రం. ఇక్కడే ఐటీ పార్కులు, స్టార్టప్‌ విలేజ్‌, ఫిన్‌టెక్‌ వ్యాలీ, మిలీనియం టవర్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐబీఎం, కాండ్యుయెంట్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఏపీ నుంచి జరిగే ఐటీ ఎగుమతుల్లో 80 శాతం వాటా ఇక్కడి కంపెనీలదే. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఐటీలో విశాఖపట్నానికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ క్రమంగా తెర మరుగవుతోంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై ఆధారపడి కొత్త కంపెనీలు ఏర్పాటు చేసినవారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడలో ఇలాంటి కంపెనీలు ఇక నడపలేమని కొందరు మూసేసుకుంటే, మరికొందరు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు దెబ్బతినే విధంగా ప్రస్తుత వ్యవహారాలు నడుస్తున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

నాలుగు నెలలుగా ఒక్క కార్యక్రమమూ లేదు..

విశాఖపట్నం ఐటీ విభాగంలో గత నాలుగు నెలలుగా ఒక్క కార్యక్రమమూ నిర్వహించలేదు. కొత్త కంపెనీలు లేవు. ఐటీ మంత్రి గౌతంరెడ్డి రెండు, మూడుసార్లు వచ్చి ఐటీ కంపెనీల అసోసియేషన్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కొత్త పాలసీని తీసుకువస్తామని, అంతవరకు వేచి చూడక తప్పదని స్పష్టంచేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తాము అలాంటి టెక్నాలజీలకు సహాయం అందించబోమని, కేవలం రాయుతీలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం వద్ద నిధులు లేవని పరిశ్రమలకు సంకేతాలు పంపింది.

(ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ)ఎపీటా కార్యాలయం ఖాళీ..

రాష్ట్రంలో ఐటీకి విశాఖపట్నమే కేంద్రం కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఎపీటా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎపీటా కార్యాలయాన్ని టెక్‌ మహీంద్రా ప్రాంగణంలో ఏర్పాటుచేసి, అందులో పరిపాలన, అకౌంట్స్‌, మౌలిక వసతులు, ప్రమోషన్‌ విభాగాలు ఏర్పాటుచేసి ఒక్కో దాంట్లో ముగ్గురిని చొప్పున నియమించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలోని ఎపీటా కార్యాలయంలోని అందరికీ ఉద్వాసన పలికేశారు.

అంతా కలిపి రూ.13 కోట్లే..

రాష్ట్రంలోని ఐటీ కంపెనీలన్నింటికీ రాయితీలు, అద్దెలకు కలిపి మొత్తం రూ.13 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం 50 శాతం అద్దె ఇస్తామని భరోసా ఇవ్వడంతో ఐటీ కంపెనీలకు భవనాలు ఇచ్చిన యజమానులు ఆ ఆదాయంపై 18 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారు. అద్దె సకాలంలో వచ్చినా రాకపోయినా జీఎస్‌టీ మాత్రం చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

ఇన్నోవేషన్‌ సొసైటీలో మిగిలింది ఒక్కరే...

రుషికొండలో సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుచేసి ఆ తరువాత దానిని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీగా పేరు మార్చారు. ఒక్క విశాఖపట్నంలోనే మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, స్టార్టప్‌ ఎవల్యూయేషన్‌ వింగ్‌లలో 30 మంది ఉండేవారు. ప్రస్తుతం ఒకే ఒక అమ్మాయిని హెచ్‌ఆర్‌గా ఉంచి మిగిలిన వారిని తీసేశారు.

Next Story