ఏపీ: వాయుగుండంతో అల్లకల్లోలంగా మారిన సముద్రం
By సుభాష్ Published on 13 Oct 2020 8:53 AM ISTకోస్తాంధ్రలో వాయుగుండం తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఈ వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలిక పాటివర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉందని, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాయుగుండం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్బ, మరఠ్వాడా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.