ఆడెడు వాడు చంద్రబాబు.. ఆడించెడు వాడు జగన్ బాబు!!

By రాణి  Published on  31 Dec 2019 6:26 AM GMT
ఆడెడు వాడు చంద్రబాబు.. ఆడించెడు వాడు జగన్ బాబు!!

వైఎస్ జగన్ అంటే కేవలం నెత్తిన చేతులు పెట్టి, నుదుట ముద్దులు పెట్టుకునే వాడే కాదు. మహా చాణక్యం నెరపగల నాయకుడు. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించడంలో విఫలమౌతారు. కీలెరిగి వాత పెట్టడం ఆయన ప్రత్యేకత. నిదానంగా వ్యూహం పన్ని శత్రువులను ఉచ్చులోకి లాగడంలో ఆయన అఖండుడు. ఈ విషయాన్ని కూడా చాలా మందికి అర్థం కాదు.

2014 లో ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్ల తేడాతో అధికారం సాధించలేకపోయిన తరువాత ఈ అదనపు అయిదు లక్షలు బిజెపి దయాభిక్షమేనని జగన్ గుర్తించారు. అందుకే బిజెపి నుంచి టీడీపీని దూరం చేయడానికి ఆయన పథకాలు వేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెచ్చి, సదస్సులు, దీక్షలు, ధర్నాలు చేసి చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేశారు. దాంతో చంద్రబాబు ఆయన ఉచ్చులో పడి కేంద్రాన్ని తానూ విమర్శించడం మొదలుపెట్టారు. చివరికి నాటకం నిజమైపోయింది. బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. చంద్రబాబు బిజెపి, వైకాపాలు కలిసిపోతాయేమోనన్న భయంతో బిజెపి మతతత్వ పార్టీ అన్న మాటను పదేపదే వైకాపాకు గుర్తు చేశారు. వైకాపా లక్ష్యం బిజెపి-తెదెపాలను వేరు చేయడమే కానీ, బీజేపీతో చేతులు కలపడం కాదు. ఈ మిత్ర భేదం చివరికి చంద్రబాబును ఓటమి పాలు చేసింది. తెదేపా అధికారాన్ని హరించింది. ఆఖరికి వైకాపా అధికార పీఠాన్ని అధిరోహించింది.

ఇప్పుడు చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. బిజెపికి చేరువయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత చేసినా ఇంకా నాలుగేళ్లకు కానీ ఎన్నికలుండవు. కాబట్టి తక్షణం వైకాపాకి వచ్చే నష్టమేమీ లేదు. పైగా రాజ్యసభ, లోక్ సభల్లో తన ఎంపీలను తెలివిగా వాడుకుంటూ జగన్ బిజెపితో అంటకాగకుండానే, ఆత్మీయంగా వ్యవహరిస్తున్నారు. బిజెపికి కూడా తక్షణం జగన్ ను వ్యతిరేకించాల్సిన అవసరం కనిపించడం లేదు. ఈ వ్యూహంలోనూ జగన్ దే పైచేయి అయింది.

కుడితిలో పడ్డ ఈగలా టీడీపీ

ఇప్పుడు తాజాగా మూడు రాజధానుల ఇష్యూనే చూద్దాం. నిజానికి ఇది “ఆలూ లేదు... చూలూ లేదు... అల్లుడిపేరు సోమలింగం” లాంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోలేదు. ఇంకో నిపుణుల కమిటీ నివేదిక వచ్చేదాకా ఎదురుచూస్తామని చెబుతోంది. కానీ టీడీపీ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఈగలా తయారైంది. అమరావతి ఆయనకు కావాలి. కానీ ఆ మాటే పైకి అంటే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమల్లో తెదేపా తుడిచిపెట్టుకుపోతుంది. ఆయన పరిస్థితి “కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం” లా ఉంది. రాజధాని నిర్ధారణ కాలేదు. రాజధాని మారినా పనులు పూర్తయ్యేసరికి ఏళ్లు పడుతుంది. అంటే జరిగేదీ, ఒరిగేదీ ఏమీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఇరుకున పడిపోయారు. ఇదీ జగన్ దెబ్బంటే...!!

సోమవారం రాజధాని విషయంలో చంద్రబాబు గుంటూరులో పెద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. జనాన్ని బాగానే మొబిలైజ్ చేశారు. అనుకూల మీడియా ఎలాగో చేదోడు వాదోడుగా ఉండనే ఉంది. మొత్తం సెటప్ పూర్తయిన తరువాత ఇక ధర్నా ప్రారంభం కావడమే తరువాయి అనే సమయంలో చంద్రబాబును చిందరవందర చేసే వార్త వచ్చింది. అదేమిటంటే ఆయన నమ్మకస్తుడు, పార్టీ పశ్చిమ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. దీంతో మీడియా దృష్టి మరలింది. ధర్నా తెల్లబోయింది. అందరూ టీమ్ టీడీపీ రెండో వికెట్ పడిపోయిందని చర్చించడం మొదలుపెట్టారు. ధర్నా కథ కంచికెళ్లిపోయింది.

తన ప్రతిపక్ష నేత హోదా పోతుందేమోనన్న భయంతో చంద్రబాబు నీరసించిపోవాలన్నదే జగన్ వ్యూహం. అయితే ఆయన ఇది కేసీఆర్ లా క్షణాల్లో పూర్తి చేయడం లేదు. నిదానంగా, ఒక్కొక్క ఎమ్మెల్యేని తన వైపుకు లాక్కుని, చంద్రబాబు నీరసిల్లేలా చేస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ ఏ పార్టీకి చెందని ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయమని చంద్రబాబు అడగలేరు. ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు పోతే ఆయన ప్రతిపక్ష నేత హోదా పోతుంది. పోనీ తెగించి శాసనసభ సభ్యత్వం పోతే మళ్లీ ఎన్నిక జరుగుతుంది. అదే జరిగితే గన్నవరం చంద్రబాబు చేజారిపోవడం ఖాయం. దాంతో ఆయన నొప్పిని మౌనంగా భరించి ఊరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. ఇప్పడు మద్దాలి గిరి ఉపాఖ్యానం చంద్రబాబు పుండు మీద కారం చల్లినట్టు. ఇలాంటి మరో నలుగురు తెదేపా ఎమ్మెల్యేలు వెళ్తారేమోనన్న భయంతో ఆయన కాలం గడుపుతుంటే, టైమ్ చూసి వాత పెట్టేందుకు జగన్ రెడీగా ఉన్నారు.

సో... మొత్తం మీద అర్థమయ్యేదేమిటంటే జగన్ తాళ్లు పట్టుకుని ఆడిస్తున్నారు. చంద్రబాబు కీలుబొమ్మలా ఆగుతున్నారు. గేమ్ ఈజ్ స్టిల్ ఆన్!!

Next Story