ఆయన అప్పుడు ఉప ముఖ్యమంత్రే.. ఇప్పుడూ ఉప ముఖ్యమంత్రే!!

By రాణి
Published on : 31 Dec 2019 12:36 PM IST

ఆయన అప్పుడు ఉప ముఖ్యమంత్రే.. ఇప్పుడూ ఉప ముఖ్యమంత్రే!!

రాజకీయాల్లో హీరో ఎలా వుంటాడు? అజిత్ పవార్ లా ఉండాలి. నెలన్నర క్రితం పెదనాన్నను సవాలు చేసి, పార్టీ మొత్తాన్ని తీసుకెళ్లి కమలనాథులతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎనభై గంటల్లోనే ఆ ప్రయోగం పూర్తిగా వికటించింది. ఒక్కొక్క ఎన్సీపీ ఎమ్మెల్యే శరద్ పవార్ గూటికి చేరారు. చివరికి అజిత్ కూడా బాబాయి పంచన చేరాడు. అదీ మామూలుగా కాదు. పిన్ని స్వయంగా వచ్చి బ్రతిమలాడింది. చెల్లి స్వయంగా వచ్చి గులాబీ పూలు ఇచ్చి స్వాగతించింది. ఆలింగనం చేసుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తరువాత కానీ ఆయన ఎన్ సీ పీ లో చేరలేదు.

మూడు రోజుల ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుdడు ఎన్సీపీలోకి తిరిగి వచ్చి నెల రోజులు పూర్తి కాకుండానే అజిత్ పవార్ మళ్లీ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సారి శరద్ పవార్ ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. ఆయన దెబ్బకు విలవిల్లాడిన శివసేన, కాంగ్రెసులు ఆయన్ను ఉప ముఖ్యమంత్రి చేశాయి. మొత్తం మీద ఆయన అప్పుడూ ఇప్పుడూ ఉపముఖ్యమంత్రే.

ఇది అజిత్ పవార్ పవర్ అంటున్నారు ఆయన అభిమానులు. ప్రతి ఎన్నికలోనూ తన మెజార్టీని పెంచుకుంటూపోతూ, పార్టీలో పలువురు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని, సొంత గ్రూపును నడిపిస్తున్న అజిత్ పవార్ ను ఎక్కువ కాలం దూరం పెట్టలేమని శరద్ పవార్ గుర్తించారు. అందుకే ఆయన్ని మంత్రి వర్గంలో ఉంచితే తప్ప తిరుగుబాటును ఆపేమని ఆయన తెలుసుకున్నారు. అందుకే ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయనకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.

అజిత్ పవార్ వ్యూహాలను, ఎత్తుగడలను, ఎందరినో చిత్తు చేసిన శరద్ పవార్ నే చిత్తు చేసిన, అందరినీ చిత్తు చేసే అమిత్ షానే పడగొట్టిన ఆయన చాకచక్యాన్ని, చాణక్యాన్ని బహుశః మన తెలంగాణలో ఒక మేనల్లుడు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటాడు!! అజిత్ లాగానే ప్రతి ఎన్నికలోనూ మెజారిటీని పెంచుకుంటున్న అజిత్ పవార్ వ్యూహాలను ఆయన నేర్చుకోవాలని ఖచ్చితంగా అనుకుంటాడు. ఏమంటారు?

Next Story