అమరావతిపై రాజుకుంటున్న ఏపీ రాజకీయం...చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

By Newsmeter.Network  Published on  5 Dec 2019 10:38 AM GMT
అమరావతిపై రాజుకుంటున్న ఏపీ రాజకీయం...చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

అమరావతిపై ఏపీలో మళ్లీ రాజకీయ కుంపటిమొదలైంది. టీడీపీ, వైసీపీలు పోటా-పోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఒకరిపై మరొకరు నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అమరావతిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఒకవైపు టీడీపీ ఆరోపిస్తుంటే, టీడీపీ ఐదేళ్ల పాలనో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించలేదని మరోవైపు వైసీపీనేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి అంశంపై స్పందించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కాకూడదని, ప్రజా రాజధానిగా అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని అన్నారు చంద్రబాబు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదపడేలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని వ్యాఖ్యానించారు.

మన బిడ్డలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని అన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధా కారాదు, భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ తపన అంటూ ట్వీట్ చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భావితరాల భవిష్యత్‌ అమరావతి అని చెప్పుకొచ్చారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల పాలన ఏంటో ప్రజలకు తెలుసని, వైసీపీలా గొప్పలు చెప్పుకొనే అలవాటు తమపార్టీకి లేదన్నారు.



Next Story