వల్లభనేని.. మద్దాలి గిరి.. గొట్టిపాటి.. నెక్స్ట్ ఎవరు?

By Newsmeter.Network  Published on  2 Jan 2020 6:45 AM GMT
వల్లభనేని.. మద్దాలి గిరి.. గొట్టిపాటి.. నెక్స్ట్ ఎవరు?

మొన్న వల్లభనేని వంశీ... నేడు మద్దాలి గిరిధర్....రేపు ఎవరు? ఇదీ ఇప్పడు చంద్రబాబు నాయుడును తీవ్రంగా కలవరపెడుతున్న ప్రశ్న!

ప్రస్తుతం ఆయన ముందున్న అతిపెద్ద సమస్య ప్రజా సమస్యలు కావు. ఉన్న గుప్పెడు మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఇటునుంచి అటు అయితే ఆయన విపక్ష నేత హోదా పోతుంది. విపక్ష నేత హోదా పోతే శాసనసభలోని అందరు ఎమ్మెల్యేలతో పాటూ ఆయన కూడా ఒకరైపోతారు. ప్రత్యేకత ఏమీ ఉండదన్నది ఆయన అభిప్రాయం. ఇదే ఆయన ముందున్న అతి పెద్ద సమస్య. అందుకే ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే ఆయన కలవరపడుతున్నారు. వల్లభనేని అన్ ఎటాచ్డ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపు మద్దాలి గిరిధర్ కూడా అలాగే అసెంబ్లీలో కూర్చుంటారు. ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా అదే దారిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే వైకాపాలోని తన మిత్రులందరితో ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. నేడో రేపో ఎవరో ఒక నేత ఆయనకు జగన్ కు అపాయింట్ మెంట్ కుదురుస్తారు. భుజం నుంచి పచ్చ కండువా జారిపోతుంది. దాన్ని తొక్కుకుంటూ ఆయన జగన్ చేత నీలం, తెలుపు, ఆకుపచ్చ కండువా వేయించుకుంటారు. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాటితే చాలు... చంద్రబాబు గారికి విపక్ష నేత హోదా పోతుంది.

వైకాపాకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు

విపక్ష ఎమ్మెల్యేల రాజకీయ వ్యభిచారం తెలుగునాట కొత్తేం కాదు. గతంలో వైకాపాకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఇలాగే రాత్రికి రాత్రి “బెస్ట్ ఆఫర్” కి అమ్ముడుపోయారు. అందులో కొందరికి మంత్రి పదవులూ దక్కాయి. ప్రజలు వారిని ఎన్నికల్లో పూర్తిగా బుట్టదాఖలు చేశారు. వారికిప్పుడు అతీగతీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ రాజకీయంగా కన్ను గీటడాలు, పైట జార్చడాలు మొదలయ్యాయి. అయితే జగన్ వారిని నేరుగా తలుపులు బార్లా తెరిచి రమ్మనడం లేదు. ఆయన వారిని అన్ ఎటాచ్డ్ ఎమ్మెల్యేలుగానే ఉంచాలనుకుంటున్నారు. వారు రాజీనామా చేస్తే కానీ వైకాపాలో చేరడానికి వీల్లేదు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత ఓపికా తీరికా ఈ ఎమ్మెల్యేలకు లేదు. దాంతో వారు “మంగళసూత్రం కట్టించుకోకుండానే” సంసారం చేయడానికి సిద్ధమౌతున్నారు. జగన్ కి కూడా ఇదే కన్వీనియంట్ గా ఉంది.

అయితే జగన్ మాత్రం ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి లాక్కోవడంలో వీలైనంత నిదానంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు “నెక్స్ట్ ఎవరు?” అన్న టెన్షన్ తో సతమతం అవుతారు. వెంట వున్న వారినే అనుమానించేలా తయారవుతారు. పార్టీలో పరస్పర నమ్మకాలు దెబ్బతింటాయి. తెదేపా బలహీనపడుతుంది. జగన్ కు కావాల్సింది కూడా ఇదే. ఉరికంబం ఎప్పుడెక్కిస్తారో అని వేచి చూసే ఖైదీ పరిస్థితిలో చంద్రబాబు ఉండాలన్నదే ఆయన కోరిక. అందుకే ఒకే సారి ఆరుగురి ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించకుండా ఆయన ఒక్కొక్కరినీ నిదానంగా లాగుతున్నారు.

దురదృష్టమేమిటంటే చంద్రబాబు నాయుడు దీనిని గట్టిగా విమర్శించలేరు. ఎందుకంటే ఆయన 23 మందిని ఇదే పద్ధతిలో లాక్కున్నారు. అయినప్పటికీ జగన్ విపక్ష నేత హోదాను తొలగించలేకపోయారు. వైకాపాకి పెద్దగా నష్టం చేయలేకపోయారు. పైగా ఈ ఫిరాయంపుల పాపభారం పెరిగి ఆయనే ఎన్నికల్లో ఓడిపోయి, విపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు జగన్ అదే ఆట ఆడుతున్నారు. అయితే ఇది ఆట అనేకన్నా చెలగాటం అనడమే సరైనది. ఈ చెలగాటం చంద్రబాబుకి ప్రాణసంకటంలా పరిణమిస్తోంది.

Next Story