తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నుంచి విడ‌త‌ల వారీగా 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు లాగేశారు. ఆ స‌మ‌యంలో వైసీపీ బాధ‌ను చూసి టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డ్డారు. సొంత‌పార్టీ ఎమ్మెల్యేల్లోనే న‌మ్మ‌కం నిల‌ప‌లేని వ్యక్తి ప్ర‌తిప‌క్ష నేత‌గా ప్ర‌జ‌ల‌కు ఏం ధైర్యం చెబుతారంటూ నాడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని టీడీపీ నాయ‌కులు ఎద్దేవ చేశారు.

కానీ, మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను తీసుకుందో.. అంతేమంది టీడీపీ త‌రుపున గెలిచారు. దీన్ని వైసీపీ దేవుడు రాసిన స్ర్కిప్ట్ అని అభివ‌ర్ణించింది. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ వైపు ఎమ్మెల్యేల ప్ర‌వాహం మొద‌ల‌వుతోంది. ప‌రిస్థితి చూస్తుంటే టీడీపీ ప్ర‌తిప‌క్ష హోదాకే ఎసరు వ‌చ్చేలా ఉంది.

అసెంబ్లీలో ఏ పార్టీకైనా ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కాలంటే మొత్తం స‌భ్యుల్లో క‌నీసం ప‌దిశాతం మంది స‌భ్యులు ఆ పార్టీకి ఉండాలి. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏపీ అసెంబ్లీలో టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. చూస్తుంటే అది క‌ష్ట‌మే అనిపిస్తోంది. 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరిలు, టీడీపీకి దాదాపు దూరంగా జ‌రిగేశారు. మ‌రో ముగ్గురు టీడీపీ నుంచి త‌ప్పుకుంటే ఆ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా క‌ష్ట‌మే.

కాక‌పోతే నేరుగా వైసీపీ కండువా క‌ప్పుకోవాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ కండీష‌న్స్ పెట్ట‌డంతో ఇది వ‌ర‌కు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వెన‌క్కు త‌గ్గారు. కానీ టీడీపీలో ఉండ‌లేక.. నేరుగా వైసీపీలోకి చేర‌లేక ఇబ్బంది ప‌డుతున్న టీడీపీ ఎమ్మెల్యేల‌కు వ‌ల్ల‌భ‌నేని వంశీ కొత్త‌దారి చూపారు.

వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎంచుకున్న మార్గాన్నే ఇత‌ర టీడీపీ ఎమ్మెల్యేలూ ఎంచుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లుస్తున్నారు. క‌లిసి బ‌య‌ట‌కురాగానే.., చంద్ర‌బాబు నాయ‌క‌త్వ లోపాల‌ను ఎత్తిచూపుతున్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా ఇలా చేయ‌గానే ఆయ‌నపై టీడీపీ వేటువేసింది. దాంతో వంశీ అదే అదునుగా త‌న‌పై టీడీపీ వేటువేసింద‌ని, త‌న‌ను ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించాల్సిందిగా స్పీక‌ర్‌ను కోరారు. స్పీక‌ర్ కూడా అందుకు అంగీక‌రించ‌డంతో వ‌ల్ల‌భ‌నేని వంశీ అసెంబ్లీలో ప్ర‌త్యేక స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

ఈ సూత్రం న‌చ్చ‌డంతో మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వ‌స్తున్నారు. మూడు రోజుల క్రితం గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి కూడా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. బ‌య‌ట‌కు రాగానే చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా అదే దారిలో ప‌య‌నించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాక‌పోతే వ‌ల్ల‌భ‌నేని వంశీపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన టీడీపీ మ‌ద్దాలి గిరిపై మాత్రం వేటు వేయ‌కుండా వెన‌క్కు త‌గ్గింది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే అసెంబ్లీలో ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్న టీడీపీ త‌మ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోలేని స్థితిలో ప్ర‌స్తుతం ఉంది.

టీడీపీని వీడుతార‌న్న ప్ర‌చారం..

త్వ‌ర‌లోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ కూడా టీడీపీని వీడుతార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక డెక్క‌న్ క్రానిక‌ల్ కూడా గొట్టిపాటి ర‌వికుమార్ టీడీపీ నుంచి దూరంగా జ‌ర‌గ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని, వైసీపీ సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తున్నట్టు ఆ ప‌త్రిక తాజాగా ఒక క‌థ‌నంలో వెల్ల‌డించింది.

కాగా, 2014లో వైసీపీ త‌రుపున గొట్టిపాటి ర‌వికుమార్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జ‌గ‌న్‌తో చాలా స‌న్నిహితంగానే ఉండేవారు. అయితే, ఆయ‌న గ్రానైట్ వ్యాపారంపై టీడీపీ ప్ర‌భుత్వం వేధింపుల‌కు తిగ‌డంతో.. ఆ ఒత్తిడితోనే ఆయ‌న టీడీపీలో చేరార‌ని చెబుతుంటారు. టీడీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి కూడా గొట్టిపాటి ర‌వికుమార్‌కు, క‌ర‌ణం బ‌ల‌రామ్‌కు మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌లేదు. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు బ‌హిరంగంగానే తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా చంద్ర‌బాబు హ‌యాంలో చేసుకున్నారు.

ప్ర‌స్తుతం క‌ర‌ణం బ‌ల‌రామ్ చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. గొట్టిపాటి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత కూడా గొట్టిపాటి ర‌వికుమార్ గ్రానైట్ బిజినెస్‌పై అధికారులు నిఘావేసి ఉంచారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్టు చెబుతున్నారు. నేరుగా వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఆ ప‌నిచేయ‌కుండా త‌ట‌స్థ స‌భ్యుడిగా ఉండేందుకు గొట్టిపాటి ర‌వికుమార్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

అదే జ‌రిగితే టీడీనీ సంఖ్యాబ‌లం 20కి ప‌డిపోతుంది. నేరుగా వైసీపీలో చేర‌కుండా త‌ట‌స్థంగా ఉండ‌టం వ‌ల్ల ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదే స‌మ‌యంలో మున్ముందు కూడా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఇదేప‌నిచేస్తే అసెంబ్లీలో టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా క‌ష్ట‌మే కావొచ్చు అన్న సంకేతాలు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి విన‌ప‌డుతుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.