తెలంగాణ-ఏపీ సరిహద్దు వద్ద వలసకూలీల పడిగాపులు..
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 5:22 AMఒక రాష్ట్రంలో ఇచ్చిన పాసులు మరో రాష్ట్రంలో చెల్లవంటూ అధికారులు చెబుతుండడంతో వలసకూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు వెళ్లలేక.. తిరిగి వెనక్కి వెళ్లలేక సరిహద్దు గ్రామాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ - ఏపీ సరిహద్దు వాడపల్లి దగ్గర కూలీలు పడిగాపులు గాస్తున్నారు. ఉదయం నుంచి సరిహద్దు వద్ద ఏపీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలకు తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాసులు చెల్లవంటూ.. గుంటూరు పోలీసులు ఏపీలోకి వచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో సరిహద్దులోనే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో దామరచర్ల వద్ద షెల్టర్లలో ఉన్న కూలీలకు పోలీసులు పాసులు జారీ చేశారు. అయితే.. ఏపీలోకి వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాసులు చెల్లవంటూ నిరాకరిస్తుండడంతో.. ప్రస్తుతం వారు అక్కడే పడిగాపులు పడుతున్నారు. దీంతో కీలోమీటర్ల మేర వాహానాలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున 5:00 నుంచి పడిగాపులు కాస్తున్నా.. ఇక్కడ ఎటువంటి వసతులు లేవని, చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు చెప్పారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.