తొమ్మిది నెల‌ల గ‌ర్భం మాయ‌మైంది..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2020 2:42 PM GMT
తొమ్మిది నెల‌ల గ‌ర్భం మాయ‌మైంది..!

ఓ మ‌హిళ పెళ్లైన ఆరేళ్ల త‌రువాత నెల‌త‌ప్పింది. ఆశా వ‌ర్క‌ర్‌ సాయంతో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప్ర‌తి నెల ప‌రీక్ష‌లు చేయించుకుంది. నెల‌లు నిండ‌డంతో రాత్రి ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఆమె వైద్య సేవ‌ల‌కు నిరాక‌రించింది. తాను ఇంటి వెళ‌తాన‌ని ప‌ట్టుప‌ట్టడంతో.. చేసేది ఏమీ లేక ఆటోలో ఆమెను ఇంటికి పంపిచారు. తీరా తెల్లారి లేచి చూస్తే ఆమె గ‌ర్భం మాయ‌మైంది. ఈ వింత ఘ‌ట‌న జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన మానస(25)కు చిన్న‌పోతుపాడుకు చెందిన వెంక‌టేశ్‌తో ఆరు సంవ‌త్స‌రాల క్రితం వివాహం జ‌రిగింది. గ‌తేడాది ఆమె నెల‌త‌ప్పింది. నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి నుంచి స్థానిక ఆశా వ‌ర్క‌ర్ సాయంతో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప్ర‌తి నెల ప‌రీక్ష‌లు చేయించుకుంది. నిన్న రాత్రి ఆమెకు నొప్పులు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆమె వైద్య సేవ‌ల‌కు నిరాక‌రించింది. త‌న‌కు దేవుడు పూనాడ‌ని కేక‌లు వేసింది. నేను ఇక్క‌డ ఉండ‌ను.. ఇంటికి వెళతాన‌ని ప‌ట్టుప‌ట్టింది. చేసేది ఏమీ లేక ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లాక ఆమె హాయిగా నిద్ర‌పోయింది.

ఉద‌యాన్నే ఆమెను చూసిన కుటుంబ‌స‌భ్యులు షాకైయ్యారు. ఎందుకంటే ఆమె క‌డుపు ఖాళీగా ఉంది. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు ఆరా తీయ‌గా.. దేవ‌డు వ‌చ్చి నా బిడ్డ‌ను తీసుకెళ్లాడ‌ని చెబుతోంది. వెంట‌నే కుటంబ స‌భ్యులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పీహెచ్‌సీ వైద్యురాలు దివ్య ఆస్ప‌త్రికి చేరుకుని ఘ‌ట‌న పై విచార‌ణ చేప‌ట్టారు. ఈ విష‌య‌మై వైద్యురాలిని వివ‌ర‌ణ కోర‌గా.. గ‌‌త ఏడు నెల‌ల నుంచి ఆమెకు పరీక్ష‌లు తానే చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఆమెకు డెలివ‌రీ అయిన‌ట్లు గానీ, అబార్ష‌న్ అయిన‌ట్లు గానీ అనిపించ‌డం లేద‌న్నారు. స్కానింగ్ చేస్తే గానీ అస‌లు నిజం తెలియ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. గ‌ర్భం ఎలా మాయ‌మ‌వుతుంద‌ని, ఆమె చెప్పేదంతా అబ‌ద్దం అని కొంద‌రు వాదిస్తున్నారు.

Next Story