మందుబాబులకు మరో ట్విస్ట్‌.. లిక్కర్‌ కార్డు వచ్చేనా..?

By అంజి  Published on  10 Dec 2019 7:08 AM GMT
మందుబాబులకు మరో ట్విస్ట్‌.. లిక్కర్‌ కార్డు వచ్చేనా..?

అమరావతి: రాష్ట్రంలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తోంది. ఇప్పటికే దశలు వారిగా మద్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది. అయితే తాజాగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల కోసం ప్రభుత్వం త్వరలో లిక్కర్‌ కార్డ్‌ను ప్రవేశపెడుతుందన్న వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మద్యం కొనాలనుకునే వారు ముందుగా రూ. 5 వేలతో కార్డును కొనుగోలు చేయాలని.. అందులో డబ్బులు అయిపోయాక మళ్లీ రెన్యూవల్‌ చేసుకోవాలని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలు రోజు వారీ కూలీ డబ్బులతోనే మద్యం కొనుగోలు చేస్తారు. లిక్కర్‌ కార్డు ప్రవేశ పెట్టడం ద్వారా మద్యానికి దూరంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోందని ప్రముఖ వెబ్‌సైట్‌లో కథనం రాశారు. కార్డు ద్వారా మద్యం కొనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని.. ఒక లిక్కర్‌ కార్డు ద్వారా ఒక్కరు మాత్రమే మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు.

రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్‌ సర్కార్‌ ఒక్కొక్క అడుగు వేస్తోంది. ఇప్పటికే భారీగా వైన్‌ షాపులను, బార్లను కుదించింది. ప్రతి సంవత్సరం బార్లను, వైన్‌ షాపులను కుదిస్తామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. మద్యం ధరలను కూడా పెంచేసింది.

కాగా లిక్కర్‌ కార్డు అనే ప్రతిపాదన మద్యం అమ్మకాల్లో లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ కమిటీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం లిక్కర్‌ కార్డును ప్రవేశ పెడుతందని వస్తున్న వార్తలు అవాస్తమని తెలిపారు.

Next Story