మేము వస్తే.. ఆయన బయటికి వెళ్లిపోతాడట..
By అంజి
అమరావతి: ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఏదో ఓ రకంగా ప్రతిపక్షం కుట్ర చేస్తూనే ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాను మాట్లాడని మాటలను ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న మద్దతును చూసి.. వైసీపీకి మైనారిటీలను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు.
రాజకీయ లబ్ది కోసం కుట్రలు పన్నుతున్నారని, తాము బీజేపీతో కలుస్తాం అని ఎక్కడా అనలేదన్నారు. అయితే ఏపీ బీజేపీ ఇంచార్జ్ కలిసేది లేదంటున్నారు.. తాము కలుస్తామని చెప్పామా? అంటూ ప్రశ్నించారు. ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారని, మీ పార్టీలో కలుస్తామని తాము అడిగామా? అంటూ సూటిగా మాట్లాడారు. వాళ్లు కలిస్తే నేను బయటికి వెళ్లిపోతానని పవన్ అంటున్నారని అన్నారు. పవన్‌ని ఎవరు కలవమన్నారు, ఎవరు వెళ్లమన్నారని మంత్రి బొత్స అన్నారు.
చంద్రబాబును రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. 'యనమల పరువునష్టం దావా వేస్తామన్నారు దేనికోసం..?.. మీ ప్రముఖ వ్యక్తి దగ్గర రూ.2 వేల కోట్లు సీజ్ చేశామని ఐటీ చెప్పినందుకా' అంటూ మంత్రి బొత్స నిలదీశారు. ఐటీశాఖ ప్రకటనలో చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయన్నారు. ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీ వారివేనన్నారు. కడపకు చెందిన శ్రీనివాసరెడ్డి కంపెనీ, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడి కంపెనీ, లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్ కంపెనీ ఒకటి అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే టీడీపీ దోపిడీని బయటపెట్టామన్నారు. దోచుకోవడానికే చంద్రబాబు అమరావతి అంటున్నారని సృష్టంగా చెప్పామన్నారు. చంద్రబాబు దోచుకున్నాడు కనుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఓడినప్పటి నుంచి టీడీపీ, వైసీపీఐ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి బొత్స అన్నారు.