ముఖ్యాంశాలు 

► ఏపీ శాసన మండలి రద్దుపై కేంద్రం విధానమేంటీ?

► ఏఏ రాష్ట్రాల్లో శాస‌న మండ‌లి విధానం ఉంది

► ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది..?

► మ‌రి రాజ్యాంగం ఏం చెబుతోంది..?

ఏపీ శాస‌న మండ‌లిని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ముందుగా కేబినెట్‌లో ఆమోదం తెలిపిన త‌ర్వాత అసెంబ్లీలో ఓటింగ్ విధానం ద్వారా తీర్మానించారు. అనుకూలంగా 133 మంది ఓటింగ్ వేయ‌డంతో మండ‌లి ర‌ద్ద‌యింది. ఇకా మండ‌లి ర‌ద్దు త‌ర్వాత త‌దుప‌రి ఏం జ‌రుగుతోంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కార్ వైఖ‌రి ఏమిట‌న్న‌ది అంద‌రిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. దీనిపై పార్ల‌మెంట్‌, రాష్ట్ర‌ప‌తి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేపుతోంది. శాస‌న మండ‌లి ర‌ద్దు పై జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్ర స‌ర్కార్ ఏ మేర‌కు స‌మ‌ర్ధిస్తుంది..? ఈ విష‌యాన్ని తెలుసుకోవాల‌ని చ‌రిత్ర‌లోకి వెళ్లాల్సిందే.

ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు మొద‌టిసారేమి కాదు..?

ఇక ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు చేయ‌డమ‌నేది మొద‌టి సారేమి కాదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఉన్న స‌మ‌యంలో మొద‌టిసారిగా ర‌ద్ద‌యింది. శాస‌న మండ‌లితో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని, ప్ర‌జాధ‌నం వృధా త‌ప్ప మ‌రేమి లేద‌ని భావించి మండ‌లిని ర‌ద్దు చేశారు. ఇక ఆనాడు టీడీపీ కొత్త‌గా పార్టీ కావ‌డంతో మండ‌లిలో ఒక్క‌స‌భ్యుడు కూడా లేక‌కుండాపోయారు. బ‌లం పెంచుకోవ‌డానికి క‌నీసం  ఒక ట‌ర్మ్ ప‌ద‌వి కాలం పూర్త‌వుతుంది. ఈలోపు స‌ర్కార్ తీసుకునే నిర్ణ‌యాల‌ను రాజ‌కీయంగా అడ్డుకోవ‌డ‌మో, లేక జాప్యం చేయ‌డ‌మో జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావించింది. 1985లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టిసారిగా శాస‌న మండ‌లిని ర‌ద్దు అయింది.

మ‌రి రాజ్యాంగం ఏం చెబుతోంది..?

ఏపీ అటు మూడు రాజధానుల అంశం, ఇటు శాస‌న మండ‌లి ర‌ద్ద‌యిన త‌ర్వాత ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వెడెక్కాయి. ర‌ద్దు విష‌య‌మై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. భార‌త రాజ్యాంగంలోకి ఆర్టికల్స్‌  168, 169, 170, 171లు రాష్ట్రాల శాస‌న వ్య‌వ‌స్థ‌ల గురించి తెలుపుతున్నాయి. ఇందులో ఆర్టిక‌ల్ 169 రాష్ట్రాల్లో శాస‌న మండ‌లి ఏర్పాటు, ర‌ద్దు గురించి వివ‌రిస్తోంది. ఆర్టిక‌ల్ 171 ప్ర‌కారం రాష్ట్రంలో శాస‌న మండ‌లి ఏర్పాటు చేయాలంటే ఆసెంబ్లీ సీట్ల సంఖ్య మూడు వంతుల‌కు మించ‌కుండా మండ‌లిని ఏర్పాటు చేయాలి. క‌నీసం 40 సీట్లు మండ‌లిలో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో క‌నీస సంఖ్య 40తో మండ‌లి ఏర్పాటు జ‌రిగింది.

ఆర్టిక‌ల్ 169 ప్రకారం కేంద్ర స‌ర్కార్ పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల ఆమోదం ద్వారా శాస‌న మండ‌లి ఏర్పాటు, లేదా ర‌ద్దు చేయ‌డం జ‌రుగుతుంది. శాస‌న మండ‌లి ఏర్పాటు, ర‌ద్దు ప్ర‌క్రియ ఒక‌టే. ఇక అంత‌కు ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు మూడో వంతుల మెజార్టీని తీర్మానం చేసి పంపించాల్సి ఉంటుంది. దానిని కేంద్ర హోంశాఖ‌, న్యాయ శాఖలు ప‌రిశీలించి కేంద్ర మంత్రివ‌ర్గంలో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేసి, గెజిట్ నోటిపికేష‌న్ ఇవ్వ‌డంతో ప్ర్ర‌క్రియ పూర్త‌వుతుంది. ఇందుకు ఒక నిర్ణీత కాలంలోనే పూర్తి చేయాల‌నే నిబంధ‌న లేదు. ఈ మండ‌లి ఏర్పాటు, ర‌ద్దు అనే ప్ర‌క్రియ కేంద్ర స‌ర్కార్ పై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఏఏ రాష్ట్రాల్లో శాస‌న మండ‌లి విధానం ఉంది

అస‌లు ఈ శాస‌న మండ‌లి విధానం ఏఏ రాష్ట్రాల్లో  ఉంది అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌త సంవ‌త్స‌రం జ‌మ్మూ క‌శ్మ‌ర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లుతో అక్క‌డున్న శాస‌న మండ‌లి ర‌ద్ద‌యిన త‌ర్వాత భార‌త‌దేశంలో ఉన్న రాష్ట్రాల్లో శాస‌న మండ‌లి ఉన్న రాష్ట్రాలు కేవ‌లం 6 మాత్ర‌మే ఉన్నాయి. అవి..

  1. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  2. తెలంగాణ‌
  3. క‌ర్నాట‌క‌
  4. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌
  5. బీహార్‌
  6. మ‌హారాష్ట్ర‌

ఇక ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు చేస్తే మిగిలివున్న రాష్ట్రాలు ఐదు మాత్ర‌మే. ఇక గ‌తంలో మండ‌లి ఉండి, త‌ర్వాత ర‌ద్దు చేసిన రాష్ట్రాలూ.. కొన్ని తిరిగి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇలా మ‌ళ్లి ఏర్పాటు చేయాల‌ని కోరే రాష్ట్రాలు పంజాబ్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, అస్సాం ఉన్నాయి. వీటిలో త‌మిళ‌నాడు మండ‌లి పున‌రుద్ద‌ర‌ణ కోసం మూడు ప‌ర్యాయాలుగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగించి విఫ‌ల‌మైంది. అలా కొత్త‌గా మండ‌లి ఏర్పాటు చేయాలంటూ ఒడిశా, రాజ‌స్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి.

గ‌తంలో శాస‌న మండ‌లి ఉన్న త‌మిళ‌నాడు రాష్ట్రం మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య జ‌రిగింది. ఏఐఏడీఎంకేకు చెందిన ఎంజీ రామ‌చంద్ర‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో 1986లో ఆ రాష్ట్ర శాస‌న మండ‌లి ర‌ద్ద‌యింది. అయితే మండ‌లి ర‌ద్దుకు కార‌ణం లేక‌పోలేదు. తాను నిర్ణ‌యించిన వ్య‌క్తిని నామినేటెడ్ ఎమ్మెల్సీని చేయ‌లేక‌పోయార‌నే కార‌ణంతో ఎంజీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మిళ న‌టి నిర్మ‌ల‌ను ఎమ్మెల్సీ చేయాల‌ని ఎంజీఆర్ అనుకున్నారు. ఆ మేర‌కు నామినేటెడ్ ఎమ్మెల్సీగా 1986 ఏప్రిల్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆమె అప్ప‌టికే ఇన్ సాల్వేన్సీ పెట్టుకోవ‌డం వ‌ల్ల రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 102(1) ప్రకారం.. రుణాన్ని చెల్లించలేక ఐపీ పెట్టుకున్న వ్యక్తి దేశంలోని ఏ చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడం సాధ్యం కాదని సుందరం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నిర్మల తన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో మనస్తాపానికి గురైన అప్పటి సీఎం ఎంజీఆర్ ఏకంగా మండలినే రద్దు చేశారు. తర్వాత మండలి పునరుద్దరణ కోసం డీఎంకే పలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఏపీ విషయానికొస్తే..

శాసన మండలి భారతదేశంలోని శాసన వ్యవస్థలో ఎగువ సభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్‌ 1958 నుంచి 1985, 2007 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తర్వాత విడివిడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉండగా, ముగ్గురి రాజీనామాతో ఆ సంఖ్య 55 మందికి చేరింది.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏపీ రాష్ట్రం ఒకే పార్లమెంటరీ వ్యవస్థలో పని చేసింది. 1956 డిసెంబర్‌ 5వ తేదీన ఏపీ సభ శాసన మండలి ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసింది. అధికారికంగా శాసన మండలి 1958 జూలై 1న ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలో 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జులై 8వ తేదీన అప్పటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్‌ మండలిని ప్రారంభోత్సవం చేశారు. అలా మొదలైన మండలి 1985లో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం, ఏపీ శాసన మండలి చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపింది. ఆ తర్వాత రెండేళ్లకు పార్లమెంట్‌లో ఆమోదం పొంది ఏపీ శాసన మండలి రద్దయింది.

1989లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీఎం మర్రి చెన్నారెడ్డిలో శాసన మండలి పునరుద్దరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మండలిని పునరుద్దరించడానికి 1990 జనవరి 22న అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆమోదించారు. వారు పంపిన తీర్మానాన్ని పార్లమెంట్‌ పట్టించుకోలేదు. దాంతో ఆ తీర్మానం అప్పటి అసెంబ్లీ వరకే పరిమితమైంది.

మరలా ఆ తర్వాత 2004 కేంద్ర, రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఏపీ శాసనసభ 2004, జులై 8 శాసన మండలి పునరుద్దరణకు ఏపీ శాసన సభలో మరోసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని 2004, డిసెంబర్‌ 15వ తేదీన ఏపీ కౌన్సిల్‌ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని 2006, డిసెంబర్‌ 15న లోక్‌ సభ ఆమోదించింది.

ఇక ఆ బిల్లు డిసెంబర్‌ 20వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. అనంతరం 2007, జనవరి 10న రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడంతో 2007, మార్చి30న ఏపీ శాసన మండలి ఏర్పాటైంది. ఏప్రిల్‌ 2వ తేదీన అప్పటి ఏపీ గవర్నర్‌ రామేశ్వర్‌ ఠాకూర్‌ మండలిని ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత మరోసారి శాసన మండలిని రద్దు చేస్తూ వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది..?

ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా శాసన మండలి ఏర్పాటు చేయడం రాజకీయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెడుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలో శాసన మండలిని పునరుద్దరించినా.. కొత్తగా ఏర్పాటు చేసినా.. మండలి ఏర్పాటు చేయాలని కోరుతున్న మిగతా రాష్ట్రాలు కూడా మళ్లీ తెరపైకి వస్తాయి. ఏపీ రాష్ట్ర అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయి. దీనిని అలుసుగా తీసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశాలుంటాయి.

ఇదంతా పక్కనబెడితే ఏపీ శాసన మండలి రద్దు చేయడం వల్ల టీడీపీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే టీడీపీ వంటి బలమైన పార్టీలు బలహీన పడితే తప్ప సాధ్యం కాని పరిస్థితి. టీడీపీని దెబ్బకొట్టే చాన్స్ వైసీపీకి ఇస్తుంటే ఎందుకు వదులుకుంటారనే సందేహం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే ఇంకో సందేహం కూడా వ్యక్తమవుతోంది. మండలిలో ఎలాగో చోటులేని బీజేపీ.. తనకున్న ఇద్దరు ఎమ్మెల్సీలను రోడ్డన పడేసి ఈ తీర్మానాన్ని ఎందుకు అంగీకరిస్తుందనే చర్చకూడా జరుగుతోంది.

కాగా, శాసన మండలి రద్దు అంశంలో బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం పరోక్షంగా రద్దును వెంటనే ఆమోదిస్తామని సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దుపై ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయని కూడా అంటున్నారు రాజకీయ వేత్తలు. ఏదేమైనా మండలి రద్దుపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.