జగన్‌ సర్కార్‌ సంచలనం

By సుభాష్  Published on  1 March 2020 10:07 AM GMT
జగన్‌ సర్కార్‌ సంచలనం

ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్ పాలనపరంగా దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక జగన్‌ అమలు చేసిన దాంట్లో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ, అలాగే ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వడం. జగన్‌ ఆదేశించిన నాటి నుంచి ప్రతి నెల వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ డబ్బులు అందజేస్తున్నారు. ఆదివారమైనా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం, వాలంటీర్లు కొత్త రికార్డును నమోదు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 47 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. సాయంత్రం వరకు 60 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రమూ పంపిణీ చేయనటువంటి భారీ స్థాయి సంఖ్యలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించబోతోంది. పెన్షనర్ల సంఖ్య పెంచిన ఏపీ సర్కార్‌ మరో ఐదు లక్షల మందికి పెన్షన్లు అందజేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు పది శాతం డబ్బులు ఈ పెన్షన్ల కోసమే కేటాయిస్తోంది జగన్‌ సర్కార్‌. కాగా, జనవరి నెలలో కొంత మంది పెన్షనర్లు తమకు పెన్షన్‌ రాలేదని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిని రీ వెరిఫికేషన్‌ చేసి ఈనెలలో గత నెల పెన్షన్‌ కలిపి మొత్తాన్ని అందజేస్తున్నారు వాలంటీర్లు.

ఏపీలో 15 రకాల పెన్షన్ల అందజేత

ఏపీ ప్రభుత్వం 15 రకాల పెన్షన్లను అందజేస్తోంది. అందులోవృద్దులకు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఒంటరి మహిళలు ఇలా రకరకాలుగా పింఛన్లను అందజేస్తోంది. నెలకు రూ.2250 చొప్పున ఇస్తున్నారు. ఇక చర్మకారులు, కళాకారులు, దివ్యాంగులు, దీర్ఘాకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు, హిజ్రాలకు ఇలా ప్రతి నెల రూ.3వేల వరకు అందజేస్తున్నారు. అంతేకాకుండా తలసేమియా వ్యాధిగ్రస్తులు, బోధకాలుతో ఇబ్బంది పడుతున్నవారికి, డయాలసిస్‌ చేయించుకునేవారికి రూ. 5వేల చొప్పున అందజేస్తోంది ఏపీ సర్కార్‌. ఇలా నెలకు 60 లక్షల మందికి పెన్షన్‌ అందజేస్తోంది.

ఇక పక్షవాతం, రక్తహినతతో బాధపడేవారికి నెలకు రూ.10వేల చొప్పున అందజేస్తోంది. ఇంతమందికి పెన్షన్లు ఇస్తుండటంతో ప్రభుత్వానికి నెలకు రూ. 13,20.76 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇక జనవరి నెలలో 54 లక్షల 68వేల, 322 మంది పెన్షన్‌ పొందగా, ఇక ఫిబ్రవరి నెలలో పెన్షన్‌ పొందే వారి సంఖ్య 60 లక్షలకు చేరింది. మరి ఎక్కువ పెన్షన్లు పొందేవారి సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. ఈ ఒక్క జిల్లా మొత్తం 6 లక్షల 23వేల, 93 మంది ఉన్నారు. ఇక తక్కువ పెన్షన్లు పొందుతున్న జిల్లా విజయనగరం. ఈ జిల్లాలో 3 లక్షల 2వేల 734 మంది ఉన్నారు.

Next Story
Share it