సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ భేటీ

By సుభాష్  Published on  29 Feb 2020 1:32 PM GMT
సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ భేటీ

ఏపీ సీఎం జగన్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌ నత్వానీ కూడా ఉన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖేష్‌ అంబానీ తొలిసారిగా కలిశారు. ఈ భేటీలో ఏపీలో రిలయన్స్‌ సంస్థ భవిష్యత్తులో పెట్టే పెట్టుబడులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశాలపై జగన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అంబానీ స్నేహితుడు పరిమళ్‌ నత్వానీ రాజ్యసభ సీటు నిమిత్తమై ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

పరిమళ్‌ నత్వానీ రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్‌లో ముగియనుంది. బీజేపీ అధిష్టానం సూచనల మేరకు పరిమళ్‌కు రాజ్యసభ ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అంబానీ జగన్‌ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పరిమళ్‌ నత్వానీ విషయానికొస్తే.. అంబానీకి అత్యంత సన్నిహితుడు. రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పరిమళ్‌ గతంలో జార్ఖండ్‌ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ సందర్భంగా జగన్‌.. ముఖేష్‌ అంబానీ, కుమారుడు అనంత్‌ అంబానీలకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ లో అంబానీకి ఎంపీ విజయసాయిరెడ్డి, మరి కొంతమంది నేతలు స్వాగతం పలికారు.

Next Story
Share it