ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు ..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసింది. విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెన్షన్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా రాజధాని విశాఖకు మార్చాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో ఏపీ ప్రభుత్వం కర్నూలుకు కార్యాలయాల తరలింపుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించేందుకు జనవరి 31న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 13జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్‌, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతి రావు వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.

శుక్రవారం వీటిపై న్యాయస్థానం విచారణ  జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పరిపాలన సౌలభ్యం కోసం అన్ని అంశాల్ని పరిశీలించి కార్యాలయాలు కర్నూలుకు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొందని, సచివాలయంలో విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చైర్మన్‌, సభ్యుల కార్యాలయాల నిర్వహణకు తగినంత స్థలం లేకపోవడం వల్ల వాటిని కర్నూలుకు తరలిస్తున్నామని ఏజీ తెలిపారు. ఆ రెండు సంస్థలు, తగినంత స్థలం లేకపోవడం వల్ల వాటిని కర్నూలుకు తరలిస్తున్నామని  ఏజీ తెలిపారు. ఆ రెండు సంస్థలు స్వతంత్రమైనవని, వాటి కార్యాలయాల ఏర్పాటు అంశం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని విచారణ సందర్భంగా ఏజీ చెప్పారు. దురుద్దేశంతో కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

పిటిషనర్‌, ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *