కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

By రాణి  Published on  5 March 2020 1:02 PM GMT
కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కరోనాపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అప్రమత్తమైపోయింది. అందుకు సంబంధించిన హెల్త్ అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అపోహలకు చెక్ పెడుతూ 05-03-2020న మీడియా బులిటెన్ ను విడుదల చేసింది.

హెల్త్ అప్డేట్

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే కరోనా వైరస్(కోవిద్-19) వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలకు సూచనలు పంపించింది. 75 దేశాల్లో ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి చెందిందని, అంతర్జాతీయంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా వైరస్ విషయంలో అప్రమత్తమైంది. వివిధ దేశాల నుండి వచ్చిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కోవిడ్-19 ప్రబలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సమాచారాం ప్రకారం. కరోనా వైరస్ పాకిన దేశాల నుండి స్వస్థలాలకు వచ్చిన 330 మంది ప్రయాణీకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. 102 మందిని వారి.. వారి ఇంట్లోనే ఐసోలేషన్ పద్ధతుల్లో ఉంచామని..216 మందిని ఐసోలేషన్ వార్డులో 28 రోజుల పాటూ ఆబ్సర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. 12 మంది ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు మొత్తం 23 శాంపుల్స్ కలెక్ట్ చేశామని.. 11 మందికి కోవిద్-19 నెగటివ్ రాగా, 12 మంది టెస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా రావాలని అన్నారు. 24*7 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశామని.. ప్రతి జిల్లాలోనూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లోనూ, జిల్లా ఆసుపత్రులలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఇప్పటికే ఏర్పాటు చేశారు.

కోవిడ్-19 ప్రబలకుండా చేతులను ఎప్పటికప్పుడు కడుక్కోవాలని వైద్యులు సూచించారు. ముఖ్యంగా ముక్కు-నోరు తప్పకుండా మాస్క్ లాంటి వాటితో కప్పుకోవాలని అన్నారు. దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవడం.. లేదా కర్చీఫ్ లాంటివి వాడాలని సూచించారు. ఎవరైనా దగ్గుతున్నా, తుమ్ముతున్నా కనీసం ఒక మీటర్ దూరం ఉండాలని అన్నారు.

జ్వరం, అలసట, పొడి దగ్గు లాంటివి వైరస్ లక్షణాలు అని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి వచ్చిన వాళ్లకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఐసోలేషన్ వార్డుల్లో 28 రోజుల పాటు ఉంచనున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని అన్నారు. జ్వరం, అలసట, పొడి దగ్గు, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కులో నుండి నీరు కారుతుండడం, గొంతులో మంట, డయేరియా లాంటి లక్షణాలు ఉంటే మాస్కులు వేసుకోవాలని.. వెంటనే 108 కు కాల్ చేయాలని కోరారు. 24X7 కంట్రోల్ రూమ్ 0866-2410978 కు ఫోన్ చేయాలని అన్నారు. జిల్లాల వారీగా కరోనా అనుమానితులను సంబంధించిన వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Next Story