'దిశ చట్టం'పై ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల నియామకం

By సుభాష్
Published on : 3 Jan 2020 12:50 PM IST

దిశ చట్టంపై ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల నియామకం

మహిళా అభివృద్ధి, శిశోసంక్షేమ శాఖ సంచాలకులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి కృతికా శుక్లాకు దిశ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల రక్షణే ధ్యేయంగా జగన్‌సర్కార్‌ తీసుకువచ్చిన ఈ చట్టం విధివిధానాల రూపకల్పనలోనూ కృతికా శుక్లా ముఖ్య పాత్రపోషించనున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ చట్టం అమలుపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు. మహిళలు, పిల్లలలపై జరుగుతున్నలైంగిక నేరాలపై విచారణ కోసం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ సమన్వయం చేసే బాధ్యత కూడా ఈ ప్రత్యేక అధికారిపై ఉంది

మరో వైపు లైంగికంగా వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవల గురించి కూడా కృతికా శుక్లా తన బృందంతో పరిశీలించడంలో కీలక పాత్ర పోషిస్తారు. చట్టం అమలులో భాగంగా బాధితులకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు గాను అన్ని ఆస్పత్రుల్లో దిశా చట్టం కోసం ప్రత్యేక వైద్య కేంద్రం ప్రారంభిస్తారు. సున్నా ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల సామాజిక, చట్టపరమైన సమాయం అందించడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేలా పని చేయాల్సి ఉంటుంది.

అలాగే ప్రత్యేక హోదాలో కృతికా శుక్లా మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులలో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసుల సహకారం వంటి సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తారు.

Next Story