గ‌త ఏడాది జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కుముందు రాష్ట్రాన్ని కుదిపేసిన అంశాల్లో వైఎస్ వివేకా హ‌త్య‌కేసు ఉదంతం ఒక‌టి. వివేకా నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుడే కావ‌డం, హ‌త్య‌లో త‌న బంధువుల హ‌స్తం ఉంద‌న్న అంశం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదే అదునుగా భావించిన నాటి అధికార పార్టీ టీడీపీ ఆ హ‌త్య‌ను వైఎస్ జ‌గ‌నే చేయించార‌న్న ప్ర‌చారానికి తెర‌తీసింది.

కాగా, కేసు విచార‌ణ‌లో భాగంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై ఎవ‌రూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కూడ‌దంటూ హైకోర్టు ఆదేశించ‌డంతో టీడీపీ విమ‌ర్శ‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డిన‌ట్ల‌యింది. అదే స‌మ‌యంలో వివేకా హ‌త్య‌ను జ‌గ‌నే చేయించారని క్రియేట్‌చేసే ఉద్దేశంతో వివేకా ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, త‌దిత‌రుల‌కు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తారుమారైనటువంటి ఇష్యూ వ‌ర‌కే కేసు విచార‌ణ వెళ్లింది.

ఇక ఆ త‌రువాత వివేకా హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు అడిగిన జ‌గ‌న్‌.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సీబీఐ విచార‌ణ జ‌ర‌ప‌కుండా ఒక స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను నియ‌మించింది. గ‌తంలో ఉన్న ఆఫీస‌ర్లు ఒత్తిళ్ల‌కు వెన‌క్కు త‌గ్గార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కొత్త అధికారుల‌తో క‌మిటీ వేశారు. కాగా, ఇటీవ‌ల వీరు వివేకా హ‌త్య‌కు సంబంధించి ఒక కీల‌క క్లూను క‌నిపెట్టారన్న అంశం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా, అందుతున్న స‌మాచారం మేర‌కు వైఎస్ వివేకా హ‌త్య జ‌రిగిన రోజు అప్ప‌టి వర‌కు ఆసుప‌త్రిలో ఉన్న‌ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి.. ఆసుప‌త్రి నుంచి వెళ్లి క‌డ‌ప‌లోని హ‌రిత హోట‌ల్‌లో బీటెక్ ర‌విని క‌లిశార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేష‌న్ క‌మిటీ స‌మాచారాన్ని సేక‌రించింది. ఆయా ప్రాంతాల్లో గ‌త రెండు రోజుల నుంచి విచారిస్తున్న‌టువంటి అంశం ఇది. విచార‌ణ‌లో తేలిన అంశాల‌పై అధికారులు మ‌రింత దృష్టి సారించిన‌ట్టు తెలుస్తుంది.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆది నారాయ‌ణ‌రెడ్డి, బీటెక్ ర‌వి హ‌స్తం ఉందంటూ ప్ర‌స్తుతం అధికారులు టార్గెట్ చేస్తున్న అంశం. ఇదిలా ఉండ‌గా, కుట్ర‌లు, హ‌త్య‌లు త‌న ఇంటవంట లేవ‌ని, చేత‌నైతే ఉరేసెయ్యండి అంటూ వివేకా హ‌త్య‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇప్ప‌టికే తేల్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోప‌క్క‌, బీటెక్ ర‌వి కూడా త‌న‌ను కావాల‌ని ఇరికిస్తున్నారంటూ హ‌త్య‌పై స‌వాల్ చేస్తున్న‌టువంటి ప‌రిస్థితి నెలకొంది. ఆ మ‌ధ్య‌న వైఎస్ వివేకా సోద‌రుడు భాస్క‌ర్‌రెడ్డిని సైతం విచార‌ణ నిమిత్తం అధికారులు పిల‌వ‌డంతో  కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన‌టువంటి హ‌స్తం కూడా ఉండి ఉండ‌వ‌చ్చు అన్న అంశం కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఏదేమైనా అన్ని నిజాలు నిగ్గు తేలాలంటే..? అన్ని ప్ర‌శ్న‌ల‌పై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఏ కోణాల‌వైపుకు వెళ్తుంది..?  ఏ తీరాల‌కు చేరుకుంటుంది..? అన్న‌ది చూడాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.