'ఏపీ దిశా చట్టం'.. అభినందించిన చిరంజీవి..!

By అంజి  Published on  12 Dec 2019 1:22 PM IST
ఏపీ దిశా చట్టం.. అభినందించిన చిరంజీవి..!

హైదరాబాద్‌: ఏపీ దిశా చట్టాన్ని అభినందిస్తూ చిరంజీవి ప్రకటన చేశారు. ఏపీ దిశా చట్టం- 2019' పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న బాలికల యువతకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ ఉందని చిరంజీవి పేర్కొన్నారు. దిశ సంఘటన దేశ ప్రజలందర్నీ కలిచివేసిందని, ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయన్నారు. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందని నటుడు చిరంజీవి వ్యాఖ్యనించారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమన్నారు.

సీఆర్పీసీని సవరించడం ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం మంచి పరిణామం అన్నారు. ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి అన్నారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

ఏపీలో మహిళల భద్రత కోసం రూపొందించిన ఏపీ క్రిమినల్ లా (సవరణ) బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం సాయంత్రం రాష్ర్ట మంత్రి వర్గంతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో మహిళల భద్రత కోసం చేసిన ఏపీ క్రిమినల్ లా (సవరణ) గురించి చర్చించి, దానికి ఆమోదం తెలిపారు. రాష్ర్టంలో ఏ ఆడపిల్లపై అయినా, మహిళలపై అయినా అఘాయిత్యాలు జరిగితే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో నేరం రుజువైతే తీర్పు ఇచ్చేలా కొత్త చట్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ చట్టానికి ”ఏపీ దిశ యాక్ట్” గా నామకరణం చేశారు. ఇకపై అత్యాచార కేసులకు సంబంధించిన విచారణ జరిపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. యాసిడ్ దాడులు, అత్యాచారం కేసులు, సోషల్ మీడియాలో మహిళలను కించపరచడం వంటివి ”ఏపీ దిశ యాక్ట్” కేసుల కింద నమోదు చేయబడుతాయని తెలిపారు.

Next Story