ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

By సుభాష్  Published on  30 March 2020 9:17 AM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతుండగా, తాజాగా ఏపీలో కూడా మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విశాఖలో నమోదైన ఈ కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇక విశాఖలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. బర్మింగ్‌హోం నుంచి విశాఖకు వచ్చిన వ్యక్తికి ఈనెల 17వ తేదీన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అనంతరం అతని కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు అతని తండ్రికి కూడా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అలాగే మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆదివారం 85 మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రానికి పంపించారు. ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన ఆరోగ్యశాఖ.. విశాఖకు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపింది. కరోనా వచ్చిన వారు నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 29,494 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని, మరో 178 మంది ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

నిత్యావసర వస్తువుల అధిక ధలకు అమ్మితే చర్యలు

ఇక కరోనా ప్రభావంతో నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చాయి. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ధరలు అందరికీ కనిపించేలా బోర్డులు పెట్టాలని, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ కూడా పెట్టాలన్నారు. కష్ట కాలాన్ని వ్యాపారానికి వాడుకుంటాం అంటే కుదరని అధికారులు హెచ్చరించారు. నిత్యావసరాల స్టాక్స్‌ అంచనా వేసి కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఆక్వా పంట చేతికి వచ్చే సమయమైందని, కచ్చితంగా ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయాలని సూచించారు. 50 శాతం వర్కర్స్‌ని ప్రాసెసింగ్‌ యూనిట్లకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అయితే అందరూ సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు అధికారులు.

Next Story