కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ.. మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశం

By Newsmeter.Network  Published on  27 March 2020 9:10 AM IST
కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ.. మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తేనుంది. ఇందుకోసం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. 5వ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం పూర్తికావస్తుండటంతో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇప్పటికే ఈ నెల 29న బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి తొలుత ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించడంతో అసెంబ్లి సమావేశాలు నిర్వహించటం అసాధ్యంగా మారింది. 2020- 2021 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మూడు నెలల కాలానికి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేనున్నట్లు తెలుస్తోంది.

Also Read :భారత్‌లో ఒక్క రోజే 88 కరోనా కేసులు..

తొలుత అసెంబ్లి సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ఆమోదించాలని భావించినప్పటికీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, వారి సహాయకులు, అధికార సిబ్బంది, భద్రతా సిబ్బంది అసెంబ్లికి పెద్ద సంఖ్యలో రావాల్సి వస్తుంది. దీనివల్ల కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే కేబినెట్‌ భేటీ అయ్యి మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. కేబినెట్‌ భేటీ అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు.

Also Read :కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

ఇదిలాఉంటే మూడు నెలల కాలానికి ఎంతమొత్తం అనుమతి తీసుకుంటారనేది ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది. ప్రతీ నెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, వడ్డీలు, అసలు చెల్లింపులు, నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికి పరిగణలోకి తీసుకుంటే రూ. 15వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకే సుమారు రూ.1330 కోట్ల వరకు కావాలి. జూన్‌ నెలలో రైతు భరోసా నిధులు చెల్లించాలి. ఇలా సగటున నెలకు రూ.15వేల కోట్ల చొప్పున మూడు నెలలకు రూ. 45వేల కోట్లు అవసరమవుతాయి. ఇతరత్రా అవసరాలు కూడా కలిపి మొత్తం రూ. 60 వేల కోట్ల నుంచి 65వేల కోట్ల వరకు ద్రవ్య వినిమయానికి ఆమోదం తీసుకొనే అవకాశం కనిపిస్తుంది.

Next Story