ఆమోద పబ్లికేషన్స్ భూకేటాయింపులు రద్దు చేసిన ఏపీ కేబినెట్
By Medi Samrat
ఆమోద పబ్లికేషన్స్ భూకేటాయింపును ఏపీ కేబినెట్ రద్దు చేసింది. ఓ ప్రముఖ దినపత్రిక కోసం ఆమోద పబ్లికేషన్స్ పేరిట విశాఖలోని పరదేశి పాలెంలో జరిగిన ఒకటిన్నర ఎకరా భూకేటాయింపును కేబినెట్ రద్దు చేసింది. రూ. 40 కోట్ల విలువ చేసే భూమిని రూ. 50.05 లక్షలకే 2017లో గత టీడీపీ ప్రభుత్వంలో ఈ కేటాయింపులు జరిగాయని పేర్ని నాని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగినందుకే.. 2017 జూన్ నాటి కేటాయింపులు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన అన్నారు.
అవన్నీ అవాస్తవాలు : ఆమోద పబ్లికేషన్స్
ఏపీ కేబినెట్ ఆరోపణలను సదరు పత్రికా యాజమాన్యం ఖండించింది. గత ప్రభుత్వం అప్పనంగా భూమి కేటాయించిందనడం అవాస్తవమని.. చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి భూకేటాయింపులు చేయలేదని పేర్కొంది. 1986లోనే చట్టబద్ధంగా అప్పటి ప్రభుత్వం సంస్థకు ఎకరన్నర భూమి కేటాయించిందని.. తర్వాత కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం.. మా ఆధీనంలోని ఓ ఎకరం భూమిని ప్రభుత్వం తీసుకుందని.. నాడు రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి పరిహారంగానే 2017లో పరదేశి పాలెంలో ఎకరంన్నర భూమి కేటాయింపు జరిగిందని వెల్లడించింది.