ఏపీలో రోడ్డెక్కిన బ‌స్సులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 4:38 AM GMT
ఏపీలో రోడ్డెక్కిన బ‌స్సులు

అమ‌రావ‌తి : దాదాపు రెండు నెల‌ల లాక్‌డౌన్ అనంత‌రం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభమ‌య్యాయి. దీంతో రెండు నెలల తరువాత జ‌నాల‌తో ఆర్టీసీ బస్టాండ్‌లు కళ‌కళలాడుతున్నాయి. టికెట్ కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిన అధికారులు.. బస్టాండ్ లో మాస్క్ లు లేని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.

అంత‌కుముందు డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతించారు. ఈ రోజు ఉద‌యం మొదటి స‌ర్వీసుగా సూపర్ లాగ్జరి బస్సు విజయవాడ నుండి విశాఖకు బయలుదేరింది. దూర ప్రాంతలకు ఆర్టీసీ మొదటి ప్రాధాన్యత ఇవ్వ‌డంతో విశాఖప‌ట్నం, రాజమండ్రి, కాకినాడకు బస్సు సర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్ ఉంటేనే బస్ స్టాండ్ లోకి ప్రయాణికుల అనుమతిస్తున్నారు.

లాక్‌డౌన్ 4.0 ప్ర‌కారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన‌ పలు నిబంధనలు అధికారులు అమలు చేస్తున్నారు. ఇక బ‌స్సుల‌లో ప్ర‌యాణించే ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని సూచించారు.

బస్సుల్లో కండక్టర్లు ఉండరు.. అన్ని బస్సులకూ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించడంతో.. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ ఉంటుంది.. అక్కడ టికెట్‌ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్‌ నంబరు నమోదు చేస్తారు. ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్‌ సదుపాయాన్ని కల్పించారు.. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

Next Story
Share it