ముఖ్యాంశాలు

  • ఐదేళ్ల పాటు గ్రాఫిక్‌తోనే కాలయాపన

  • గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం అప్పులపాలు

  • అసెంబ్లీలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి బుగ్గన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శివరామకృష్ణ కమిటీ పర్యటనలో ఉండగా చంద్రబాబు సర్కార్‌ నారాయణ కమిటీని వేసిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ నివేదికను గత సర్కార్‌ కనీసం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. ఏపీ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. గత చంద్రబాబు సర్కార్‌ మాదిరిగా కాకుండా పట్టణ అభివృద్ధిలో పీహెచ్‌డీలు చేసిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించాలని అన్నారు.

ఆదాయం తక్కువ.. అప్పులెక్కువ

రాష్ట్ర విభజన అనంతరం ఆదాయం తక్కువగా ఉందని, అప్పులు మాత్రం ఎక్కువ అయ్యాయని విమర్శించారు. వరదలు వస్తే మాత్రం 70శాతం వరకు అమరావతి వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని, దూర ప్రాంతాల నుంచి ప్రజలు అమరావతికి రాకుండా అభివృద్ధి వికేంద్రీకరిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని మూడు కమిటీలు స్పష్టం చేశాయన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడంతోనే సరిపోయిందని, చంద్రబాబు ఐదేళ్ల పాటు గ్రాఫిక్‌ తోనే కాలయాపన చేస్తూ జనాలను అభ్యపెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 3 లక్షల కోట్లకుపైగా అప్పులు

ఏపీ రాష్ట్రం వ్యవసాయం మీదే ఆధారపడి ఉందని, ఐదేళ్లలో 66వేల కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందన్నారు. 3  లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రంలో భావితరాలు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుందని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గొప్పనగరాలు నిర్మించగలమా..? అని అన్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప లాభాలేమి లేవన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.