ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన 12 బిల్లులు ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 1:04 PM IST
ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన 12 బిల్లులు ఏమిటి?

తప్పనిసరి పరిస్థితుల్లో కొలువు తీరిన ఏపీ అసెంబ్లీ తొలి రోజున పన్నెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీని మంగళ.. బుధవారాల్లో నిర్వహిస్తున్న వైనం తెలిసిందే. ఈ సందర్భంగా పలు బిల్లుల్ని సభలోకి ప్రవేశ పెట్టారు. సభ ఆమోదం పొందిన పన్నెండు బిల్లుల్లో ముఖ్యమైనది ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంగా చెప్పాలి.

పాలనను వికేంద్రీకరించటం ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ సర్కారు అందుకు తగ్గట్లే.. మూడు రాజధానుల అంశాన్ని బిల్లు రూపంలో సభ ముందుకు తెచ్చింది. పాలనా రాజధానిగా విశాఖ.. శాసనా రాజధానిగా అమరావతి.. న్యాయ రాజధానిగా కర్నూలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ బిల్లును గతంలోనే అసెంబ్లీలో ఆమోదించి శాసన మండలికి పంపారు. అప్పట్లో ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసింది. అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చారు. తాజాగా మరోసారి దీనికి ఆమోదం తెలిపారు.

  • మంగళవారం షురూ అయిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన పన్నెండు బిల్లులు ఏమంటే?
  • సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స మూజువాణి ఓటుతో ఆమోదించారు. అదే సమయంలో పరిపాలన
  • వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు
  • ప్రలోభాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటానికి వీలుగా ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం –1994 సవరణ బిల్లును తెచ్చారు.
  • ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లు
  • జీఎస్టీ 38వ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణ
  • ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లు
  • అక్రమ మద్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లు
  • పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లు
  • ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చట్టానికి సవరణలు
  • తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్‌’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌–జూన్‌ వరకు బడ్జెట్‌ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్‌
  • రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులతో బిల్లు

Next Story