అసెంబ్లీని ముట్టడించిన రైతులు.. పోలీసుల లాఠీఛార్జ్
By సుభాష్ Published on 20 Jan 2020 2:13 PM ISTఅమరావతితో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని రైతులు అసెంబ్లీని ముట్టడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, రైతులు సచివాలయం మెయిన్‌గేటు నుంచి లోపలికి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం సచివాలయం ఎదుట ఉన్న కాలువలోకి దిగిన మహిళలు, రైతులు నిరసన తెలిపారు.
మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా ఉంచకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ లో పలువురికి గాయాలయ్యాయి. ఇక టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా అసెంబ్లీలోకి దూసుకురావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు సచివాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి నెలకొంది.