తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి.. సంప్రదాయాలకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

By సుభాష్  Published on  15 Jun 2020 5:36 AM GMT
తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి.. సంప్రదాయాలకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విడిగా ఉన్నప్పుడు కానీ.. కలిసి ఉన్న వేళలోనూ.. విడిపోయిన తర్వాత కానీ.. ఎప్పుడూ లేని రీతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా సాగనున్నాయి. సాధారణంగా ఉండే అన్ని సంప్రదాయాలకు భిన్నంగా.. కాసింత అసాధారణంగా ఏపీ అసెంబ్లీ భేటీ సాగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించే ఈ సమావేశాలు ఆద్యంతం ప్రత్యేకమని చెప్పక తప్పదు.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు చివరిసారిగా జనవరిలో జరిగాయి. ఆ తర్వాత వచ్చి పడ్డ కరోనా మహమ్మారి పుణ్యమా అని సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం సభ నిర్వహించిన చివరి రోజు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో సభను కొలువుతీర్చాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో సభను కొలువుతీర్చనున్నారు. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల్ని ఫిబ్రవరిల చివర్లో కానీ.. మార్చి మొదట్లో కానీ నిర్వహించాలి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి.

దీంతో.. ఈసారి బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించలేదు. కరోనా నేపథ్యంలో మార్చిలో నిర్వహించలేకపోయిన తొలి త్రైమాసికానికి సంబంధించి అంటే.. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు చేసే వ్యయం కోసం గవర్నర్ చేత ఆర్డినెన్స్ ను జారీ చేయించారు. జులై నుంచి ఖర్చుకు సంబంధించి తప్పనిసరిగా అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉంటుంది. అందుకే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిమిత సమయానికి పూర్తి అయ్యేలా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించనున్నారు.

సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు సమావేశాల ప్రారంభమవుతాయి. కనిష్ఠంగా రెండు వారాల నుంచి గరిష్ఠంగా ఆరు వారాల పాటు సాగే సంప్రదాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విధానాన్ని అమలు చేసేవారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాల సమయాన్ని కుదించేశారు. తాజాగా నిర్వహించనున్న సమావేశాలు రోటీన్ కు భిన్నంగా సాగనున్నాయి.

ఈ నెల 16న ఉదయం 10 గంటలకు గవర్నర్ విజయవాడలోని రాజ్ భవన్ నుంచే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఆన్ లైన్ లో ప్రసంగిస్తారు. దీన్ని వెలగపూడిలోని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు వీక్షిస్తారు. గంట పాటు ఉండే ఈ ప్రసంగం తర్వాత ఉభయ సభలు ముగుస్తాయి. ఆ వెంటనే రెండు సభలకు చెందిన బీఏసీ సమావేశాల్ని విడిగా నిర్వహించనున్నారు. ఎజెండా ఫిక్స్ చేసిన తర్వాత రెండు సభలు కొలువు తీరనున్నాయి. ఆ వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం షురూ అవుతుంది.

ఈసారి సభలో సమయపాలనను కచ్ఛితంగా పాటిస్తూ సభ్యులను చర్చకు అనుమతిస్తారు. అనంతరం తీర్మానం ఆమోదించిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. దీన్ని కూడా వెంటనే ప్రతిపాదించటం.. చర్చను ప్రారంభించటం లాంటివి బ్యాక్ టు బ్యాక్ జరగనున్నాయి. పరిమిత చర్చ అనంతరం ఈ నెల 17న బడ్జెట్ కు ఆమోదం తెలిపటం ఖాయమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ బడ్జెట్ సమావేశాల్ని ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రోటీన్ కు భిన్నంగా చాలా వేగంగా సాగే ఈసారి అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.

Next Story