ఏవోబీలో తృటిలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్‌.. తప్పించుకున్న అగ్రనేత ఆర్కే!

By సుభాష్  Published on  23 July 2020 4:21 PM IST
ఏవోబీలో తృటిలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్‌.. తప్పించుకున్న అగ్రనేత ఆర్కే!

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్లీ అలజడి చోటు చేసుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్‌ తప్పింది. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు.. ఈనెల 19న విశాఖ ఏజన్సీలోని పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, మరో అగ్రనేత చలపతి, అరుణలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరి కోసం గత నాలుగు రోజులుగా రంగంలోకి దిగిన ఏపీ, ఒడిశా పోలీసులు ఏవోబీలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

దీంతో ఏవోబీలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడానికి ఇరు రాష్ట్రాల నుంచి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు విశాఖ ఏజన్సీకి అనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో మూడు బృందాలుగా ఉన్న 30 మంది మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అటవీ ప్రాంతంలో కీలక సమావేశం

అలాగే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కీలక సమావేశం అయినట్లు పక్కా సమాచారం అందడంలో పోలీసుల బలగాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తుండగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎదురెదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, మరో అగ్రనేత చలపతి, అరుణక్క లకు గాయాలైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కాల్పుల్లో గాయపడిన చలపతి, అరుణక్కలు ఎక్కువ దూరం వెళ్లలేరని పోలీసులు చెబుతున్నారు. వారు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే మావోలు కూడా పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఆ ప్రాంతానికి పక్కనే ఉన్న విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బుసిపుట్టు అటవీ ప్రాంతం, పెదబయలు మండలం జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల మీదుగా ఇంజెరి అటవీ ప్రాంతానికి వెళ్తున్నట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు మరింత కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఘటన స్థలంలో రక్తపు మరకలు

కాల్పులు జరిగిన అనంతరం ఘటన స్థలంలో పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పలు చోట్లు రక్తపు మరకలు, తుపాకీ, ఇతర సామాగ్రి కనిపించాయి. ఈ ఘటనలో ఆర్కే తప్పించుకున్నాడని, మరో అగ్రనేత చలపతి, ఆయన భార్య అరుణలకు బుల్లెట్‌ గాయాలు అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మావోయిస్టుల బృందాల్లో మూడో బృందంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story