సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 7:47 AM GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో విషాదం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు వదిన వరస అయ్యే సుధా అనే మహిళ కన్నుమూశారు. బీహార్ లోని పూర్ణియాలో ఆమె మరణించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త తెలిసిన‌ప్ప‌టి నుండి సుధా క‌నీసం మంచి నీళ్ళు కూడా ముట్ట‌లేదట‌. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించిందని మీడియా చెబుతోంది. ముంబైలో సుశాంత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న స‌మయంలోనే సుధా దేవి బీహార్‌లోని పూర్ణియాలో క‌న్నుమూశారు.

శేఖర్ కపూర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమైన వారు తనకు తెలుసు అంటూ చేసిన ట్వీట్ సంచలనం అవుతోంది. ”సుశాంత్ నువ్వు పడ్డ బాధ తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి తెలుసు. వారి చర్యలను భరించలేక నువ్వు నా భుజాలపైపడి కన్నీరు పెట్టుకున్నావు. గత 6 నెలల నుంచి నేను నీకు దగ్గరగా ఉండి ఉన్నా లేదా నువ్వు నన్ను కలిసి ఉన్నా బాగుండేది. నీకు ఇలా జరగడం వారి కర్మ.. నీది కాదు సుశాంత్” అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.

ఇన్ని రోజులూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను కనీసం పట్టించుకోని వారందరూ ఇవాళ తెగ బాధపడుతున్నారంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆరోపణలు గుప్పించారు. అలాగే సుశాంత్ సింగ్ ను గతంలో అవమానించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరి వలనే సుశాంత్ మానసిక క్షోభకు గురయ్యాడని.. అందుకే అతడు అంత పెద్ద స్టెప్ తీసుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story