అశోక్‌ గజపతిరాజుకు మరోషాక్.!?

By అంజి  Published on  8 March 2020 8:48 AM GMT
అశోక్‌ గజపతిరాజుకు మరోషాక్.!?

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు మరోషాక్‌ ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాను చైర్మన్‌గా ఉన్న మాన్సాస్‌ ట్రస్టులో అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ట్రస్టు ఈవో భ్రమారంభ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన జగన్‌ సర్కార్‌ ట్రస్టు లావాదేవీలు, ట్రస్టులో ఇన్నాళ్లు జరిగిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

గత కొద్దిరోజుల క్రితం అశోక్‌గజపతి రాజును సింహాచలం ఆలయ ట్రస్ట్, మాన్సాస్‌ ట్రస్ట్ చైర్మన్‌ స్థానం నుంచి తప్పించి ఆయన అన్న కూతురు సంచయితను వైకాపా ప్రభుత్వం ట్రస్ట్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రికిరాత్రే ఉత్తర్వులు ఇవ్వటం.. ఆమె వెంటనే ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారం ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడిని రాజేసింది. టీడీపీ, బీజేపీలుసైతం వైకాపా తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇన్నాళ్లు లేని రాజకీయాన్ని దేవస్థానానికి పూస్తున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే వైకాపా ప్రభుత్వం తీరుపై అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ఇతర మతస్తులకు బాధ్యతలు అప్పగిస్తే ట్రస్ట్ ఇబ్బందుల్లో పడుతుందని, ప్రభుత్వం ట్రస్టు భూములను కొట్టేసేందుకు ఈ పనిచేసిందని విమర్శించారు. గజపతిరాజు వ్యాఖ్యలకు సంచయిత అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. ఈ వ్యవహారంతో ఏపీ రాజకీయం మాన్సాస్‌ ట్రస్ట్ చుట్టూనే కేంద్రీకృతమయ్యాయి.

తాజాగా ట్రస్ట్ ఈవో ఫిర్యాదుతో ఏపీ ప్రభుత్వం గజపతిరాజును ఇరుకున పెట్టేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి, వీరపల్లిపాలెంలో ట్రస్టుకు చెందిన 365 ఎకరాల భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఈవో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వంద ఎకరాలకు అనుమతిచ్చి మొత్తం 365 ఎకరాల్లోనూ ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని, దీని వల్ల కోట్ల ఆదాయం ట్రస్టకు రాకుండా పోతుందని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ భూముల్లో 2017 నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా, ఎలాంటి చర్యలు లేవని, ఈ భూముల్లో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇసుక తవ్వకాల కోసం జరుగుతున్న సర్వే పనుల్ని ట్రస్టు మాజీ ఈవో, ప్రస్తుత దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ అడ్డుకుంటున్నారని ఈవో ఆరోపించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాలపై దృష్టికేంద్రీకరించిన ప్రభుత్వం పెద్దలు త్వరలో మాన్సాస్‌ ట్రస్ట్ లో అవినీతి జరుగుతుందని, వాటిని ఆదారాలతో సహా ప్రజలముందు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అశోక్‌ గజపతిరాజుకు కొత్త తలనొప్పి రావటంస్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలాఉంటే అశోక్‌గజపతి రాజు అనుచరులు మాత్రం ట్రస్ట్ పారదర్శకంగా నడుస్తుందని, ఇక్కడ ఎలాంటి అక్రమాలకు తావుండదని, ప్రభుత్వం ఏవిధంగా తమను ఇబ్బందులు పెట్టాలని చూసిన అవి సాధ్యపడవని పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ వ్వహారం ఎటువైపు మలుపు తిరుగుతందో వేచిచూడాల్సిందే.

Next Story