ముఖ్యాంశాలు

  • కలకలం సృష్టిస్తోన్న జామియా వర్శిటీ కాల్పులు

దేశరాజధానిలోని జామియా విశ్వవిద్యాలయం ప్రాంతంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీఏఏ కు వ్యతిరేకంగా విద్యార్థులు యూనివర్శిటీ ముందున్న రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న క్రమంలో కాల్పులు జరిగాయి. వర్శిటీ గేట్ నెంబర్ 5, గేట్ నెంబర్ 1 వద్ద కాల్పుల శబ్దం వినిపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులిద్దరు టూ వీలర్ పై కాల్పులు జరిపినట్లుగా సమాచారం. కాగా..ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం వారం వ్యవధిలో జామియా వర్శిటీ ప్రాంతంలో మూడుసార్లు కాల్పులు జరగడం గమనార్హం. కాగా కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎటువంటి బుల్లెట్లు లభ్యం కాకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

జనవరి 30, గురువారం నాడు ఒక మైనర్ రాజ్ ఘాట్ వైపు వెళ్తున్న ర్యాలీపై కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన జరిగిన రెండ్రోజులకే మరోసారి కాల్పులకు తెగబడ్డాడొక వ్యక్తి. తాజా ఆదివారం అర్థరాత్రి కూడా కాల్పులు జరగడంతో…సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను బెదరగొట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం వెనకుండి కాల్పులు జరిపిస్తూనే…మళ్లీ తమకేమీ తెలియనట్లు ఘటనలపై చర్యలు తీసుకోవాలని, నిందితులెంతటివారైనా సరే ఉపేక్షించవద్దని ప్రకటనలు చేయడం ఒక హై డ్రామా అని వాపోతున్నారు కొందరు సీఏఏ వ్యతిరేకులు.

కాగా..వర్శిటీ ముందు బైఠాయించిన విద్యార్థులు ఆందోళనను విరమించుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు ఉండటంపై ఆయన ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఆందోళన కారులపై ఎలాంటి దాడులు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకునేందుకు భారీ స్థాయిలో బలగాల్ని మోహరించినట్లు అమూల్య వెల్లడించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.