ఈజిప్టులో మరో 30 మమ్మీలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Oct 2019 10:47 AM ISTప్రాచీన నాగరికత గురించి చెప్పేటప్పుడు మొదటగా తలిచేది ఈజిప్టు గురించే. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత గల ఈజిప్టులో నాటి చారిత్రక అవశేషాలకోసం నేటికీ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అక్కడ ఒకేసారి ముప్పై శవపేటికలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలలో అసాసీఫ్ అనే ప్రాంతంలో ఇవి బయట పడినట్టుగా తెలుస్తోంది. అతి తక్కువ లోతులో, రెండు వరుసలుగా ఉండటంతో అవన్నీ ఒకే కుటుంబానికి చెందిన వారివి అని భావిస్తున్నారు.
వీటిలో పురుషులు, మహిళలు, చిన్నారులవి కూడా ఉన్నాయి. ఒక ఆలయం వెనుక వైపున ఇవి ఉండటంతో మత అధికారులకు చెందినవి కూడా కావచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు రాజుల శవపేటికలు బయటపడ్డాయి. ఇవి మూడు వేల ఏళ్ల క్రితంవి అయినప్పటికీ వాటి మీద ఉన్న ఆకృతులు, రంగులు కనీసం చెక్కుచెదర లేదని చెబుతున్నారు. వీటిని పర్యాటకుల సందర్శనార్థం గిజా పిరమిడ్లు పక్కన ఉన్న ఈజిప్ట్ పురావస్తు ప్రదర్శన శాలకు తరలించనున్నారు.