క్రికెట్‌లో ఇంతవ‌ర‌కు ఎవ‌రూ సాధించ‌ని రికార్డ్.. అంజలీ చాంద్ సాధించింది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Dec 2019 9:22 PM IST
క్రికెట్‌లో ఇంతవ‌ర‌కు ఎవ‌రూ సాధించ‌ని రికార్డ్.. అంజలీ చాంద్ సాధించింది..!

టీ20ల్లో మరో స‌రికొత్త రికార్డ్ న‌మోద‌య్యింది. నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ ఆరు వికెట్లు ప‌డ‌గొట్ట‌డ‌మే కాకుండా అసలు పరుగులే ఇవ్వకుండా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రోజు మాల్దీవులతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంజలీ చాంద్ ఈ సరికొత్త‌ రికార్డును నెల‌కొల్పింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్దీవులు 16 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంజలీ చాంద్ ఆరు వికెట్లతో చెలరేగింది. అంతేకాదు కనీసం ఒక్క పరుగును కూడా ఇవ్వ‌కుండా ఈ ఫీట్ సాధించింది. దాంతో ఆరు వికెట్లు సాధించడమే కాకుండా పరుగులివ్వని బౌలర్‌గా ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రు సాధించ‌ని రికార్డును అంజలీ చాంద్ త‌న పేరిట లిఖించుకుంది.

మీడియం పేస్‌ బౌలర్ అయిన అంజలీ చాంద్‌ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే వేసి ఆరు వికెట్లు సాధించడం విశేషం. ఇన్నింగ్సు ఏడో ఓవర్‌లో మూడు వికెట్లు సాధించిన అంజలీ చాంద్‌.. 9 ఓవర్‌లో మరో రెండు వికెట్లు, 11 ఓవర్‌లో చివ‌రి వికెట్‌ను తీసింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో పురుషుల టీ20 క్రికెట్‌లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రికార్డ్ హాట్ టాఫిక్ అయ్యింది.

Next Story