చంద్రబాబును అడ్డుకోవల్సిన అవసరం మాకు లేదు...

By Newsmeter.Network  Published on  28 Nov 2019 4:35 PM IST
చంద్రబాబును అడ్డుకోవల్సిన అవసరం మాకు లేదు...

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తన పార్టీ నేతలతో కలిసి అమరావతి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు నల్లజెండాలు ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంకటపాలెం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవల్సిన అవసరం వైసీపీ లేదని స్పష్టం చేశారు. రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశాడని, చంద్రబాబు నమస్కారం చేయాల్సింది శంకుస్థాపన స్థలానికి కాదని, భూముల ఇచ్చిన రైతులకు నమస్కారం చేయాల్సిందని ఆయన అన్నారు. రాజధాని పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి భూదోపిడీ చేశారని ఆరోపించారు. రైతులు ఇచ్చిన భూములను తన వారికి దోచిపెట్టారని మండిపడ్డారు. లక్షల కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు...ఇక్కడ చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఐదువేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన చంద్రబాబు..అక్కడ నిర్మించినవి అన్ని తాత్కాలికమేనని అన్నారు.

అసైన్డ్‌ భూముల విషయంలో చంద్రబాబు దళితులను నిలువునా మోసం చేశారని, వారి దగ్గర భూములు చౌకగా అమ్మించి మీ వాళ్లు కొన్న తర్వాత వాటిని పూలింగ్‌కు తీసుకున్నావని చంద్రబాబును ఏకరువు పెట్టారు ఎమ్మెల్యే. చంద్రబాబుకు ఎన్నికల హామీలంటే నీటి బుడగల్లాంటివని, మెనిఫెస్టో అంటే చిత్తు కాగితం లాంటివని ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్‌ మనస్థత్వం చంద్రబాబులా కాదని, ఎవరికైన అన్యాయం జరిగితే వారికి అండగా ఉండే వ్యక్తి అని అన్నారు.

అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని అన్నారు. చంద్రబాబు డ్రామాలు ఆడటంలో దిట్ట అని, నటించడంలో అరితేరిన వ్యక్తి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి ఒక్క చంద్రబాబుకే దక్కిందని విరుచుకుపడ్డారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. తమ పాలనలోఅన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని, రాయలసీమ, ఆంధ్రకు అన్నింటికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా రాజధానిని నిర్మిస్తామని అన్నారు.

Next Story